గవర్నమెంటు పుణ్యమా అని తొండలు గుడ్లుపెట్టే పొలాలు, కోట్లు ధర పలుకుతున్నాయి. ఊరు ఊరంతా కోటీశ్వరులైపోయారు అన్నాడా ఇంటల్లుడు. ఆ వెనకే కూతురూ అందుకుంది, ఇల్లు, పొలాలు కొనేందుకు బానే లెక్కలేసుకుంటున్నారుగానీ నా వాటా సంగతి తేల్చండి అని అసలు విషయం బయటపెట్టింది. మళ్లీమళ్లీ చెప్పేదేముంది? ఇక్కడ నీకిచ్చేదేంలేదు అంటూ కస్సుమన్నాడు తమ్ముడు. పండుగపూటా ఆ ఇంట్లో ఓ చిన్న యుద్ధమే జరిగింది. అసలు కారణమేంటంటే...

*********************************

ఉగాది పండుగనాటికి కూతురు వస్తుందన్న కబురు తెలిసినప్పటినుంచి కుటుంబయ్య కుదేలైపోతున్నాడు. సంక్రాంతికో, ఉగాదికో కూతురూ, అల్లుడూ, పిల్లలూ రావటం, నాలుగురోజులుండి వెళ్లడం ఆనవాయితీగా వస్తున్నదే.కుటుంబయ్య, సావిత్రమ్మ వాళ్ల రాకకోసం ఎదురుచూడటం, వాళ్లున్న నాలుగురోజులు పిండి వంటలు ఘుమఘమలు, పెద్దలముచ్చట్లు, పిల్లలకేరింతలతో ఇల్లు కళకళలాడుతూ రోజులు గిర్రున తిరిగొచ్చేవి.హరికి కూడా అక్క, బావ, పిల్లలంటే ఎంతో అభిమానంగా ఉంటాడు. కోడలు రాజ్యానికి, కూతురు రాణికి మధ్య సఖ్యత బాగానే ఉంది. మర్యాదలకు లోటులేదు. కుటుంబం మొత్తానికి కొత్తబట్టలు పెట్టేవారు. హరి తృణమో పణమో పిల్లలచేతిలో పెట్టి పంపేవాడు.ఈ రెండేళ్లకాలంలో పరిస్థితి మారిపోయింది. అక్కా, తమ్ముళ్లు ఎడముఖం, పెడమొహమైపోయారు. అంతరాంతరాల్లో ఆత్మీయులస్థానే అసూయలు, అరమరికలు రాజుకోసాగాయి.వాదప్రతివాదాలతో మొదలైన గొడవలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఆవేశకావేషాలు పెచ్చరిల్లిపోతున్నాయి.

‘‘నాన్నా! నేను మళ్ళీ వచ్చేనాటికి ఏ సంగతీ తేల్చిచెప్పండి. మీకు కొడుకే కాదు, కూతురూ ఉందని మరచిపోకండి. నా ఉసురుపోసుకొని వాడేమీ బాగుపడడు’’ అంటూ ఆక్రోశపడి మరీ వెళ్లింది.రక్తం పంచుకుపుట్టిన బిడ్డలమధ్య పొరపొచ్చాలెందుకని తనకూ, సావిత్రికీ మనసులో ఆరాటం ఉంది. కొడుకూ, కోడలు మొదటినుంచీ ఒకేమాటమీదున్నారు. ఒకరుచెబితే వినిపించుకొనే పరిస్థితిలేదు. ఎవరి స్వార్థం వాళ్లది.పెద్దరికాలకు విలువిచ్చే రోజులుపోతున్నాయి. సంయమనం, సర్దుబాటు మనుషుల్లో కలికానికైనా కానరావటం లేదు. ఈసారి కూతురు వచ్చాక పెద్ద రచ్చే జరిగేట్టుంది. కుటుంబయ్యకు ఇప్పటినుంచే దిగులు మొదలైంది.ఆంధ్రప్రదేశ్ రెండుముక్కలయ్యాక, కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ రాజధాని నిర్మాణం కోసం భూ సమీకరణ ఉత్తమమార్గంగా ఎంచుకుంది. గుంటూరుజిల్లాలోని 29 గ్రామాలకు చెందిన 33 వేల ఎకరాలను స్వచ్ఛందంగా అప్పగించమని ఆయా గ్రామాల రైతుల్ని అభ్యర్థించింది.