ఆర్టిస్ట్‌ అభిరామ్‌కి సన్మానంమినిస్టరు గారు దిగేసరికి ‘ఆర్ట్‌ గేలరీ’ లో కోలాహలం సద్దుమణిగింది. అందరూ సింహద్వారం వైపు కదిలారు. మంత్రిగారిని లోపలికి తోడ్కొని వచ్చిన నిర్వాహకులు ముందుగా ఆయనను ‘ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌’ వైపు తీసుకెళ్ళారు.సెక్యూరిటీ గార్డులు, ప్రెస్‌ వాళ్ళు, కెమేరాల లైటింగుల మధ్య ఒక్కొక్క అడగూ వేస్తూ ఒక్కొక్క పెయింటింగునూ పరిశీలిస్తున్నారు మినిస్టరుగారు. ఆర్టిస్ట్‌ తను వేసిన ఆ చిత్రాల వెనుక తన ఉద్దేశ్యాన్ని చెప్పబోతూ వుంటే మంత్రిగారు వారించారు. ఆయనకన్నీ తెలుసు. తనే కల్పించుకుని ప్రతి చిత్రంలోని మర్మాన్ని విడదీసి తనే ఆర్టిస్టుకి చెప్పడం ప్రారంభించేరు. అభిరామ్‌ అవాక్కవక తప్పలేదు.మంత్రిగారిని అమితంగా ఆకర్షించిందొక చిత్రం. శిరోజాలు విరబూసుకుని, వాటితోనే శరీరం కపకున్న ఓ నగ్న సుందరి.‘‘జుట్టు ఎంత బాగా వేసేవయ్యా?’’ అన్నారు మినిస్టరుగారు. ఓ క్షణం తర్వాత, ‘‘ఆ మెరుపూ, ఆ తళుకూ..’’ అని ఆగిపోయారు. వారి పొగడ్త జుట్టుకో లేక ఆమె శరీరానికో అర్థం కాలేదు అభిరామ్‌కి. అడిగే సాహసం చెయ్యలేదతడు.చిత్ర సందర్శనానంతరం సమావేశం ప్రారంభమైంది. వక్తలందరూ తర్వాత మాట్లాడాలని, మంత్రి గారు అర్జంటుగా వేరే పని మీద వెళ్ళవలసి వున్నందున, ముందుగా చిత్రకారునికి సన్మానం చేసి, వారి సందేశం వినిపిస్తారని నిర్వాహకులు ప్రకటన చేశారు.దుశ్శాలువా, మెమెంటోలతో ఆర్టిస్టుకి సన్మానం జరిగింది. 

మంత్రి గారు తమ స్పందనని తెలియజేస్తారని ప్రకటించారు. సూది పడితే వినబడేటట్టుంది సభ.‘‘స్నేహితులారా ఈనాడు చానా సుదినం. ఎందుకో మీ అందరికీ తెలుసు. ఈ రోజు ఈ పెయింటిస్టు వేసిన బొమ్మల్ని చూస్తావుంటే...’’ సభ్యులు ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు. ‘పెయింటిస్టు’ పదం గతంలో వారెన్నడూ విన్నట్టులేదు. ‘‘...చూస్తావుంటే, వార్నీ నేను కూడా ఇంత గొప్పోణ్ణి కాలేకపోయేనే అన్న బాధ కలుగుతాంది. చిన్నపడు నేనోపాలి బొమ్మ లేస్తావుంటే మా మేస్ర్టుగారు...’’ అంటూ మినిస్టరు గారు తన బాల్యం జాడీ మూత తీశారు. అరగంట సేపు సభ ఆ పరిమళాన్ని భరించింది. వారు మాట్లాడుతూ వుంటే, వారి ప్రతి వాక్యం చివరా చప్పట్లు కొట్టేరు సుశిక్షితులైన కొంతమంది. ఒక దశలో అది అతి అయినట్టనిపించి, నిర్వహకులు చిరాకు ప్రదర్శించబోయారు గానీ, వాళ్ళు మినిస్టరు గారి కార్లోంచి దిగినవాళ్ళని తేలడం వల్ల కిమ్మిన్నాస్తిగా ఉండిపోక తప్పలేదు.