పుట్టిన ప్రతివారు తమ సామర్ధ్యాల మేరకు తమ పనులు తాము చేస్తారు. అయితే శారీరక, మేధో శ్రమలు ఎవరు చేసినా, బతుకు తెరువుకోసం ఎవరెంతగా పాటుపడినా ఎవరి పని విలువ వారికే ఉంటుంది. కానీ కొందరు తాము చేసే పని విలువను గుర్తించలేక అసంతృప్తితో బాధపడుతూ ఉంటారు. తమ పని విలువ ఏమిటో తెలిసినప్పుడు అసంతృప్తికి తావే ఉండదు. ఈ కథలో కూడా భీమయ్య అలాంటి సమస్యనే ఎదుర్కోన్నాడు. చివరకు ఏం జరిగిందంటే...

విక్రమార్కుడు తన పట్టుదల వదలలేదు. చెట్టువద్దకు తిరిగి చేరుకున్నాడు. చెట్టెక్కి బేతాళుడు ఆవహించిన శవాన్ని దించి భుజాన వేసుకున్నాడు. ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవాన్ని ఆవహించిన బేతాళుడు, ‘‘రాజా, ఈ అపరాత్రివేళ ఏ పని తలపెట్టి ఇక్కడికొచ్చావో, ఆ పని నీ సమయంకంటే ఎక్కువ విలువైనదో కాదో నాకు తెలియదు. వెనకటికి భీమయ్య అనేవాడు తన పనివిలువ తెలుసుకోలేకపోయాడు. తడబడ్డాడు. వివేకవంతుడివైననిన్ను భీమయ్యతోపోల్చలేను. కానీ, శ్రమ తెలియకుండా నీకు ఆ కథ చెబుతాను విను’’ అంటూ ఇలా చెప్పసాగాడు.ఒక ఊళ్లో సుకుమారుడనే తెలివైనవాడు ఉండేవాడు. ఎలాంటి క్లిష్టసమస్యకైనా చక్కని పరిష్కారం చెబుతాడని అతడికి పేరు.వారు, వీరు అని కాకుండా సలహాలకోసం అన్ని వర్గాలవారూ అతడివద్దకు వచ్చేవారు.

అతడి సలహాలవల్ల ప్రయోజనం పొందినవారందరూ అతడికి వారి వారి తాహతునిబట్టి ఎంతోకొంత ధనరూపేణా ముట్టజెప్పేవారు.సుకుమారుడి సలహాలకు ఎంత పేరు వచ్చిందంటే అతడి సలహాలకోసం ఇతర ప్రాంతాలనుంచి కూడా జనం వచ్చేవారు. అలా అతడు భాగ్యవంతుడై మేడకట్టాడు. భార్యకు నగలు, చీని చీనాంబరాలు కొనిపెట్టాడు. పిల్లల్ని (ప్రయోజకుల్ని చేశాడు.సుకుమారుడికి పెళ్ళికాకముందే భీమయ్య అతడివద్ద పనివాడుగా చేరాడు. సుకుమారుడి పనులన్నీ తనే చూసుకునేవాడు. అతడిచేత స్నానం చేయించడం, అతడి బట్టలు ఉతకడం, అతడికి వేళకు భోజనం అమర్భడం, బయటకు వెళ్లినపుడు అతణ్ణి అంటిపెట్టుకునే ఉండడం - ఇవన్నీ భీమయ్య పనులు. వాటిని సవ్యంగా చేస్తూ యజమాని మెప్పుపొందాడు.

సుకుమారుడు పెళ్ళిచేసుకున్న సుచిత్రకు సంగీతం, చిత్రలేఖనంపట్ల చెప్పలేనంత ఆసక్తి. ‘‘నా పనులు చూసుకుందుకు భీమయ్య ఉన్నాడు. ఇంటిపనులన్నింటికీ వేర్వేరు పనివాళ్లున్నారు. నువ్వు నీకు ఆసక్తి ఉన్న విద్యలపై శ్రద్ధ వహించి నీ ప్రతిభకు మెరుగులు దిద్దుకో’’ అని భార్యను ప్రోత్సహించాడు సుకుమారుడు. అయినా సుచిత్ర భీమయ్యను కొన్నాళ్లు శ్రద్ధగా గమనించిన తర్వాతనే, చాలావరకూ భర్త పనులన్నింటినీ భీమయ్యకే వదిలేసింది. క్రమంగా భీమయ్య ఆమె మెప్పుకూడా పొందాడు.