కళ్ళు తెరచి చూశాడతను. చుట్టూ హాస్పిటల్‌ వాతావరణం. లీలగా ఏదో గుర్తురాసాగింది. ఎక్కడున్నాను? అడిగాడతను. హాస్పిటల్లో అన్నాడు పక్కబెడ్డుమీద ఉన్నతను. ఎంతసైపైంది నేనిక్కడకు వచ్చి? మళ్ళీ అడిగాడు. వారం రోజులైంది అన్నాడతను. ఆ మాటవిని ఆశ్చర్యపోయాడతను. డాక్టర్‌ వివరాలడిగితే, తనకెవరూ లేరని చెప్పాడు. ఇంతకీ అతనెవరు? అతని కథ ఏమిటి?

‘‘అమ్మా! తాతయ్య వచ్చాడు’’ రాఘవయ్యని చూస్తూనే ఎనిమిదేళ్ల మనవరాలు కీర్తి, ఆయన చేయి పట్టుకుని గెంతుతూ సంబరంగా అంది.‘‘ఆ సర్లే’’ ఆయన కూతురు ప్రభ లోపలినుంచి అందికానీ బయటికిరాలేదు. పదినిమిషాలు గడిచాయి. ఆలోచిస్తూ అలాగే ఆ హాల్లో ఒంటరిగా నిలబడిపోయాడు.‘‘దా కూర్చో, అమ్మ వస్తుందిలే తాతయ్య, మరి నాకేం తెచ్చావు? పూతరేకులు తెచ్చావా?’’ కీర్తి అడిగింది.రాఘవయ్య మనవరాలిని ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని, చేతిలో బ్యాగ్‌ పక్కకిపెట్టి, చెమట తుడుచుకుంటూ అలసటగా సోఫాలో కూర్చున్నాడు. సంచీలోనుంచి అరిసెలు, సున్నుండలు, పూత రేకులు తీసి మనవరాలికి ఇచ్చాడు. ఆయనకు చాలా దాహంగా ఉంది.‘‘తాతయ్యా పూతరేకులు చాలా బాగున్నాయి. నాకు ఇంకా ఇంకా కావాలి’’ తింటూ కళ్ళు గుండ్రంగా తిప్పుతూ అంది. ‘‘అలాగే, మళ్లీ వచ్చినప్పుడు తెస్తానులే’’ అంటూ మనవరాలి తల నిమురుతూ ఆమెవంక ఆపేక్షగా మురిపెంగా చూశాడు.

కాసేపు కబుర్లుచెప్పి ‘హోమ్‌వర్క్‌ చేసుకుంటాను తాతయ్యా’’ అంటూ కీర్తి లోపలికి వెళ్ళిపోయింది. ప్రభ బయటకు వస్తుందేమో అని రాఘవయ్య లోపలికి తొంగిచూశాడు. కాని ఆమె రాలేదు. ఏం చేయాలో ఆయనకి పాలుపోలేదు.చివరికి ‘‘అమ్మా ప్రభ’’ అని పిలిచాడు. ఆ పిలుపుకి ఆమెరాలేదుగానీ పని మనిషి బయటకు వచ్చి,‘‘అమ్మగారు వేరే పనిలో ఉన్నారు మిమ్మల్ని ఆ గదిలోకి వెళ్ళమన్నారు. భోజనం నేను ఆ గదిలోకి తీసుకొస్తాను’’ అంది.ఆయన ఉసూరుమంటూ లేచి మెట్లకిందవున్న చిన్నగదిలోకి వెళ్ళి మంచంమీద కూర్చున్నాడు. దుప్పటి బాగా మాసిపోయింది. చాలాకాలంగా వాడుతున్నట్టులేదు. ఫ్యాన్‌ గాలి పెంచాడుగానీ, గాలి సరిపోవటం లేదు. ఆ గదికి కిటికీ కూడా లేదు. అలికిడికి తలతిప్పి చూస్తే పనిమనిషి వచ్చి ఆయన బ్యాగ్‌ లోపలపెట్టింది. ఆమె వంకచూస్తూ మంచి నీళ్ళ విషయం మరచిపోయి అప్రయత్నంగా, ‘‘కాస్త దుప్పటి మారుస్తావా’’ అన్నాడు.