మందార కాపురానికొచ్చిన కొత్తలో ఏమీ తోచడం లేదంటే ఒక ప్రైవేట్‌ చిట్‌ అండ్‌ ఫైనాన్స్‌ కంపెనీలో చేరమన్నాడు పుండరీకాక్షం. ఐతే అదే వ్యాపకంలోపడి వేళాపాళాలేని రాకపోకలు చేయడంతో సహించలేకపోయాడు. పిల్లలుపుట్టాక మానేయమంటే వినిపించుకోలేదు. అదే ధోరణిలో నడిచింది. దాంతో పుండరీకాక్షంలో విసుగు, చికాకు ఎక్కువైనాయి. బాధ్యతంతా తన నెత్తినే వేసుకోకతప్పలేదు. తల్లిదండ్రులిద్దరూ దెబ్బలాడుకుంటుంటే చూసి భరించలేక పిల్లలిద్దరూ ఆడుకోడానికి ఎటో దూరంగా వెళ్ళిపోయేవారు.

‘‘అంటే నీకిల్లు పట్టదంటావు? పిల్లలకంటే నీకా ఉద్యోగమే ముఖ్యమా?’’ చర్రుమన్నాడు పుండరీకాక్షం ఒకరోజు.‘‘ఇంట్లో పీటలు పట్టుకుపోయి పిల్లలకు సంరక్షణ చేసుకుంటూ పోతే నా స్వేచ్ఛ హరించుకుపోతోంది’’ విసుగ్గా అంది మందార.‘‘పిల్లల బాధ్యత ఇల్లాలిదే! నీ ఒడిలో చేర్చి లాలిపాటలు పాడకపోయిన కనీస ధర్మంగా కొంతసేపైనా వాళ్ళతో గడపాలి కదా? ఎంతసేపూ నీ వ్యాపకాలేనా?’’ కటువుగానే అన్నాడు.‘‘ఔను! ప్రతిరంగంలోనూ మహిళలు దూసుకుపోతున్నారు. కేవలం ఇంటికి పరిమితమైపోతే ఎలాగండీ!’’ సూటిగా జవాబిచ్చింది.ఆ ఆలుమగల మధ్యన రోజు జరిగే రగడకిది ఓ మచ్చుతునక!ఇల్లు నరకంలా మారడం భరించలేకపోయాడు పుండరీకాక్షం.

తన శైశవమిత్రుడు శైలేష్‌ను కలిసి మనసులోని ఆవేదనంతా వెళ్ళబోసుకున్నాడు.‘‘మీ ఆవిడనేకాదు ప్రతి ఇంట్లో ఇదేగోల! ముఖ్యంగా ఈ మధ్య టీవీ కార్యక్రమాల్లో ఆడాళ్ళకు బాగా స్థానం కల్పిస్తున్నారు. వాళ్ళే క్కువగా పాల్గొంటున్నారు. అది వేలంవెర్రిగా మారింది. వాళ్ళస్వేచ్ఛకు భంగం కలిగించినట్టు ప్రవర్తిస్తే, ఇద్దరిమధ్యా అదే రసాభాసకు దారితీస్తోంది. మీ ఇద్దరిమధ్యన పిల్లలు నలిగిపోతే దేన్లోనూ వాళ్ళు రాణించలేరు. అందువల్ల మీ పిల్లల్ని విశాఖలో మంచి కార్పొరేట్‌ స్కూల్లో చేర్పించు. వారానికోసారి వెళ్ళి చూసివస్తూ ఉండు!’’ అని సలహా ఇచ్చాడు.