ఆకలి... ఆకలి... ఆకలి... అంతకుముందు ఎన్నడూ ఎరుగనంత ఆకలి. ఆగలేనంత ఆకలి. ఓర్చుకోలేనంత ఆకలి. అభిమానం, అభిజాత్యం, అహంకారం... ఏవీ గుర్తుకురానంత ఆకలి. ఆకలి బాధ అంత దుర్భరంగా ఉంటుందని మొదటిసారి తెలిసింది. అప్పుడు అతన్ని ఆకలి దహించివేస్తున్నది. ఎలాగైనా సరే ఆకలి తీర్చుకోవాలి. ప్రాణం నిలబెట్టుకోవాలి.

మరోసారి పర్సు అంతా వెతికాడు. కెలికాడు. గాలించాడు. జేబులు తడుముకున్నాడు. మామూలే. ఎంత వెతికినా, ఎన్నిసార్లు చూసుకున్నా అతగాడి దగ్గర ఉన్నది ఆ వెయ్యి రూపాయల నోటు ఒక్కటే. ఒక్కరంటే ఒక్కరూ తీసుకోవటం లేదు. ఎక్కడా చెల్లటం లేదు. అలాగని అది చిల్లులూ పడలేదు. చిరిగిపోలేదు. రద్దయ్యింది. అంతే... వెయ్యి నోటు చెల్లని నోటయ్యింది.నిజానికి చిల్లర లేని కారణంగానే అతను గత రెండు రోజుల నుంచీ భోజనం కాదు గదా, ఏవీ తినలేదు. కేవలం మంచినీళ్ళతో సరిపెట్టుకున్నాడు. ఊరుకానీ ఊరు. పరిచయం ఉన్నవారు ఎవ్వరూ లేరు. బస్సు ఎక్కుదామంటే చిల్లర కావాలన్నారు. రైలు టికెట్టు కొనాలంటే చిల్లర కావాలన్నారు.

ఆకలి తీర్చుకోవటానికి పనికిరాని నోటు దేనికి మాత్రం పనికి వస్తుంది?మూడో రోజుకి ఇక ఆకలికి ఆగలేకపోయాడు. కళ్ళు మూతలు పడుతున్నాయి. కాళ్ళు వణికిపోతున్నాయి. ఒళ్ళంతా చెమటలు పడుతున్నాయి. నీరసం... నిస్సత్తువ. దిగులు, బాధ, కోపం, అసహనం, అసహాయత...అన్నీ ఒక్కసారే చుట్టుముట్టాయి. కడుపునిండా భోజనం చేయాలని ఉంది. కనికరించేది ఎవరు? ఉచితంగా వద్దు. డబ్బు తీసుకునే. కానీ ఆ నోటు చెల్లని నోటు. నిన్నటిదాకా, దాని విలువ అక్షరాలా వెయ్యి రూపాయలు. అది జేబులో ఉంటే ఎంత ధీమాగా ఉండేది! ఎంత ధైర్యంగా ఉండేది! ఒక్కసారిగా ఎంత మార్పు! ఓడలు బళ్ళు, బళ్ళు ఓడలు కావటం ఇదేగా! అపురూపంగా చూసుకోబడిన, అందుకోబడిన నోటు ఇప్పుడు అసహ్యంగా, భయంగా చూడబడుతున్నది.