పెద్దగీతరచనః వసుంధరఒక గ్రామంలో సీనయ్య అనే రైతు ఉండేవాడు. అతడి ఇంట్లో అందరూ సన్నగా నాజుగ్గా ఉండేవారు - సీనయ్య మూడో కొడుకు కోటయ్య తప్ప! చూడగానే ఎవరికైనా నవ్వు పుట్టుకొచ్చేటంత లావుగా ఉంటాడు కోటయ్య. తల్లి శాంతమ్మ తప్ప ఇంట్లో అంతా వేళాకోళం చేసేవారతణ్ణి. అది తప్పని శాంతమ్మ అందర్నీ మందలించేది - ఒక్క గౌరిని తప్ప!గౌరి కోటయ్య ఆఖరి కూతురు. కోపం బాగా ఎక్కువ. చిన్న మాటంటే చాలు అంతెత్తు లేస్తుంది. గౌరి చేత ఏ పని చేయించాలన్నా అదేపనిగా పొగడాలి. గౌరి తప్పు చేసినా మంచి మాటలతో నచ్చజెప్పాలి తప్పితే మందలించడానికి లేదు. ఇంట్లో అందరికంటే చిన్నదని అంతా గౌరిని గారాబం చేసేవారు. ఆమె పెంకితనానికి అది కూడా ఓ కారణం. పెద్దయితే తనే మారుతుందని తలిదండ్రులు అనుకున్నారు. కానీ పెళ్లీడొచ్చినా గౌరి బుద్ధుల్లో ఏ మార్పూ లేదు.కూతురిలాగే ఉంటే అత్తవారింట్లో కష్టపడుతుందని కోటయ్యకీ, శాంతమ్మకీ తెలుసు. అందుకని గౌరి పెళ్లి గురించి వాళ్లు బెంగ పెట్టుకున్నారు. గౌరి ప్రవర్తనవల్ల ఆ యింట్లో అందరికంటే ఇబ్బంది పడుతున్నది కోటయ్య. ఆమె అతడు లావుగా ఉంటాడని నిత్యం వేళాకోళం చేసేది. 'నీ కళ్లెప్పుడూ నా వంటిమీదే!' అనేవాడతడు.'నా అసలు ఉద్దేశ్యం నీకు అర్థం కావడంలేదు. పోనీ, నా దిష్టి తగిలైనా కాస్త చిక్కి నాజూకుగా మారతావని నా ఆశ! కానీ అది జరగడం లేదు. అయినా నా పిచ్చి కానీ - దిష్టి తగిలేది మనిషి శరీరానికి కానీ, జంతు శరీరానికి కాదుగదా!' అని నవ్వేది గౌరి. కోటయ్యకు కోపమొచ్చి కొట్టడానికి గౌరిమీదకు వెడితే, 'ఏయ్‌, నన్నెందుకు కొడతావు?' అనేది గౌరి.'నీకంటే పెద్దవాణ్ణి. స్వయానా అన్నని. నా మనసు బాధ పెట్టావు. కొట్టనా మరి' అనేవాడు కోటయ్య. 'అలాగైతే మరి ఊళ్లోవాళ్లూ నిన్ను వేళాకోళం చేస్తున్నారు. కిమ్మనకుండా భరిస్తున్నావు. నేనేమో నీకంటే చిన్నదాన్ని. స్వయానా చెల్లెల్ని. నన్నెందుకు భరించవు?' అనేది గౌరి.