లవంగి ఒక రాచకన్య. చిరుతప్రాయంలోనే తలిదండ్రుల్నీ, సకల వైభవాల్నీ కోల్పోయింది. నమ్మకస్థుడైన సేవకుడొకడు దూరపు అడవిలో మున్యాశ్రమానికి చేర్చాడామెని. ఒక ముని ఆమెను పెంచి పెద్దచేశాడు. ఇప్పుడామె యుక్తవయసుకి వచ్చింది.ఒకసారి పాంచాలదేశపు రాజు విజయేంద్రుడు ఆ అడవిలో వేటకు వెళ్లాడు. అలసట తీర్చుకునేందుకు మున్యాశ్రమానికి వెళ్లి అక్కడ లవంగిని చూశాడు. తొలిచూపులోనే ఆయనకు ఆమెపై ప్రేమ పుట్టింది. లవంగికి కూడా విజయేంద్రుణ్ణి చూసీ చూడగానే మనసులో ప్రేమ పుట్టుకొచ్చింది. వాళ్లిద్దరూ ముని దీవెనతో అక్కడే దంపతులై రాజ్యానికి తిరిగి వచ్చారు.

ఈ వార్త తెలియగానే పట్టపురాణి మందారమాల హతాశురాలై మూర్ఛపోయింది. ఆ వైనం తెలిసికూడా రాజు పెద్దభార్యను సందర్శించడానికి వెళ్లలేదు. ఆయన చిన్నరాణి తోడిదే లోకమన్నట్లు జీవించసాగాడు.భర్తను తనవైపు ఆకర్షించుకుందుకు ఏమిచేయాలో తెలియని మందారమాల దిగులుతో నానాటికీ కృశించి పోసాగింది. అది గమనించిన ఆమె చెలికత్తె వందన ఎంతో బాధపడి, ‘‘అమ్మా! మీ దిగులు మీ ఆరోగ్యాన్ని పాడుచేస్తుంది. అనారోగ్యంతో ఉంటే ప్రభువులు మీకు మరింత దూరమౌతారు. నా మాటవిని మీరు ఎప్పటిలాగే ఉత్సాహంగా ఉండండి’’ అని కోరింది.

‘‘మనసునిండా పుట్టెడు దిగులుంటే, ఉత్సాహంగా ఎలా ఉంటాను? ప్రభువులు తిరిగి నాచెంతకు చేరేవరకూ నా దిగులు పోదు’’ అంది మందారమాల. ‘‘ఎల్లకాలం ఒకేలా ఉండదు. ప్రభువులకు చిన్నరాణిపై మోజు తీరిపోయాక తిరిగి మీవద్దకే వస్తారు’’ అని వందన ఆమెకు ధైర్యం చెప్పింది. కానీ మందారమాలకు నమ్మకం కుదరలేదు. ‘‘నామీద మోజు తీరే కదా, ప్రభువులు ఆమెని పెళ్ళిచేసుకున్నారు! లవంగి వయసులో నాకంటే చిన్నది. అందంలో నేను తనతో పోటీపడగలనా? నువ్వన్నది జరిగేమాటకాదు’’ అన్నది పట్టపురాణి మందారమాల.

‘‘అమ్మా! ఆకర్షణకు అందం ఒక్కటే ప్రధానంకాదు. చిన్నరాణి ప్రభువును అందంతో సాధించింది. మీరు ఆయన్ను సాధించడానికి అందాన్నిమించిన మంచితనం ఉపయోగించండి. మీరు అనుమతిస్తే, మీ మంచితనం అందరికీ తెలిసేలా నేను చెయ్యగలను’’ అంది వందన.‘‘ప్రభువుని నాచెంతకు రప్పిస్తానంటే, అనుమతి ఇవ్వనా? నీ ఇష్టమొచ్చింది చేయి’’ అంది మందారమాల.