‘‘భవ్యా కాసిని పారిజాతంపూలు ఏరుకురామ్మా’’ పూజగదిలోకి వెళ్తూ సోఫాలో కూర్చుని ఐపాడ్‌ చూస్తున్న మనవరాలికి వినిపించేలా కొద్దిగా గట్టిగానే చెప్పింది కామేశ్వరి.అప్పటికే చాటింగ్‌ స్టార్ట్‌చేసిన భవ్యకి ఆ మాట వినిపించిందిగానీ, వినిపించనట్టు తన పని తను చేసుకోసాగింది.కామేశ్వరి పూజగదిలోకి వెళ్ళి దేవుడి నిర్మాల్యం తీసి, పరిశుభ్రంచేసింది. కుందులు కడుక్కుని వత్తులు వేస్తూ మరోసారి పిలిచింది భవ్యని.

భవ్యకి చిరాకేసింది. ఈ నానమ్మకి తను హాయిగా కూర్చోడం అస్సలు ఇష్టం ఉండదు. ఊరికే పిలుస్తూనే ఉంటుంది అనుకుంటూ ‘‘చదువుకుంటున్నాను నానమ్మా, ఊరికే డిస్టర్బ్‌ చేయకు’’ అని గబ, గబా అక్కడి నుంచి వెళ్ళిపోయింది.భవ్య వెళ్ళిపోయిన వైపు చిత్రంగా చూస్తూ, ‘‘ఆ ఐ పాడ్‌లో ఏం చదువు కుంటున్నావే! రాత్రి పన్నెండింటిదాకా దాంతోనే కూర్చున్నావు, తెల్లారకముందే నిద్రలేచి మళ్ళీ అదే పట్టుకూర్చున్నావు. ఆ దిక్కుమాలిన ఐ పాడ్‌ ఎందుకు కొన్నాడో వీడు’’ నసుగుతూ తనే పెరట్లోకి వెళ్ళి పూలుకోసుకుని తెచ్చుకుంది కామేశ్వరి.ఆవిడ మాటలు వినిపించినా వినిపించనట్టు నిర్లక్ష్యంగా చాటింగ్‌ చేయసాగింది భవ్య.

రాత్రి చదువుకున్నావా? అవతల నుంచి చాట్‌బాక్స్‌లో కనిపించింది.నో ఎక్కడ చదువుకున్నా మనం చాలాసేపు చాటింగ్‌ చేశాం కదా. అవునూ రాత్రి లేట్‌గా పడుకున్నా ఎర్లీగా లేస్తావా? భవ్య టైప్‌ చేసింది.లేస్తాను. నాకు రాత్రంతా కలలో కూడా ఫేస్‌బుక్‌, వాట్సాప్‌లే కనిపిస్తాయి.మా నానమ్మకి నేను ఐ పాడ్‌తోటే ఉంటానని కోపం, తిడుతూ ఉంటుంది.మీ పేరెంట్స్‌ ఏమనరా?లేదు, నానమ్మమీదే అరుస్తుంది మా మమ్మీ.మీ మమ్మీ చాలామంచిది కదా!అవును. అది సరే మీ మమ్మీ డాడీ నిన్ను ఏం అనరా?