పెంకి పెళ్లాం- నూరుకట్ల పిశాచం కథలుః 5

చిన్ననాటి స్నేహితుడి కుమారుడికి.. తన కూతుర్ని ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నాడు.. అదే మాటను స్నేహితుడికి.. అతడి కుమారుడికి చెప్పాడా తండ్రి.. వాళ్లు కూడా ఆనందంగా సరేనన్నారు. ఆస్తితోపాటు అందమైన భార్య కూడా లభిస్తుందని ఆ యువకుడు ఆశపడ్డాడు. అయితే అదే సమయంలో ఆ తండ్రి.. తన కుమార్తె గురించి ఓ నిజం చెప్పాడు. ఆ నిజాన్ని విన్న తర్వాత కూడా పెళ్లికి ఆ యువకుడు ఓకే చెప్పాడు. కానీ పెళ్లయ్యాక ఆ యువకుడికి ఊహించని షాక్ తగిలినట్లయింది.. ఇంతకీ అసలేం జరిగిందంటే..
************************

 

అనగాఅనగా ఓ గ్రామంలో గంగరాజు అనే ఆసామి ఉండేవాడు. అతడికి ఒక్కగానొక్క కొడుకు శంకరం. మొదట్లో గంగరాజు భారీగా వ్యవసాయం చేసేవాడు. కానీ, శంకరం ప్రాజ్ఞుడయ్యాక గంగరాజు బుద్ధి మారింది. ఉన్న పొలం అమ్మేసి, వ్యాపారం ప్రారంభించాడు. శంకరం చాలా తెలివైనవాడు. అతడి సలహా సంప్రదింపులతో గంగరాజుకు బోలెడు లాభాలు వచ్చి రెండేళ్ళలోనే లక్షాధికారి అయ్యాడు.ఇలాఉండగా, ఆ ఊరికి ఒకరోజున బందిపోటు దొంగలు వచ్చారు. వారు గుఱ్ఱాలమీద స్వారీ చేసుకుంటూ రకరకాల ఆయుధాలతో వచ్చారు. వాళ్ళు పరమ దుర్మార్గులు. ఊరంతా వెదికివెదికి మరీ దోచారు. వెళ్ళేముందు, చాలా ఇళ్లకు నిప్పంటించి వెళ్ళారు. దొంగలు వెళ్ళిపోయాక, ఊరంతా గుమిగూడారు. ముందు మంటలు చల్లార్చడంలో నిమగ్నులయ్యారు.

తర్వాత దొంగలు కలిగించిన నష్టాన్ని తెలుసుకునే ప్రయత్నంలో పడ్డారు. అప్పుడు వారికి తెలిసింది ఎందరో ఆడవాళ్ళు, చిన్నపిల్లలు మంటల్లోపడి మరణించారని. మరణించిన వారిలో గంగరాజు భార్య మాణిక్యాంబ కూడా ఉంది.శంకరానికి తల్లి అంటే ప్రాణం. తల్లిపోగానే, అతడి మనసు కకలావికలమైంది. ఆ రోజునుంచీ అతడు పిచ్చివాడిలా తనలోతానే గబగబ ఏమేమో మాట్లాడుకోవడం ప్రారంభించాడు. ఇది చూసి, గంగరాజు బాగా దిగులుపడ్డాడు. భార్య పోయింది. ఉన్న ఆస్తి అంతా తుడుచుకుపోయింది. మిగిలిన ఒక్క కొడుకూ పిచ్చివాడిలా తిరుగుతున్నాడు. గంగరాజు ఆ గ్రామవైద్యుణ్ణి కలుసుకుని కొడుకు గురించి చెప్పి, ‘‘ఎలాగో అలా ఎప్పటికో అప్పటికి మీ ఋణం తీర్చుకుంటాను. మా శంకరాన్ని మళ్లీ మామూలు మనిషిని చేయండి’’ అని దీనంగా వేడుకున్నాడు. వైద్యుడు శంకరాన్ని పరీక్షించి, ‘‘కుర్రాడిలో లోపమేమీ లేదు. హఠాత్తుగా తల్లి పోవడంవల్ల మతి చెదిరిందంతే! ఈ ఊళ్లోనే ఉంటే, రోజూ తల్లి గుర్తుకు వస్తూ ఉంటుంది. స్థలం మార్చడం మంచిది’’ అన్నాడు.