ఆ వీధి మొదలులో నిలబడి ఎంతో ఆత్రుతగా తన స్నేహితుడికోసం ఎదురుచూస్తున్నాడతను. అంతలోనే గతంలోకెళ్ళిపోయాడు. కన్నీళ్ళు పెట్టుకున్నాడు. ఈ లోగా అతడు ఎదురుచూస్తున్న స్నేహితుడు రానే వచ్చాడు. అతడి కళ్ళల్లో కన్నీళ్ళను గమనించాడు. ఎప్పుడూ నవ్వుతూ ఉండే స్నేహితుడు కన్నీళ్ళతో కనిపించేసరికి హతాశుడయ్యాడు. ఇంతకీ అతనెవరు? ఎందుకాఎదురుచూపులు? అసలేంజరిగిందని?

చల్లని సాయంకాలం.సైకిలు తొక్కుతూ వచ్చి వీధిమొగలో ఆగాడు పూలబ్బాయి. హ్యాండిల్‌కి ఒకవైపు గుండ్రటి వెదురుబుట్ట వేళాడుతూ మల్లెలు విరజాజులతో గుబాళిస్తుంటే రెండోవైపు పొడవైన తాటాకు బుట్ట గులాబీలతో నిండి ఉంది.అతను ఆ వీధిలో ఆగి సైకిలు స్టాండువేసి ట్రింగ్‌ ట్రింగ్‌మని బెల్లుకొట్టగానే ఆడవాళ్లంతా వచ్చి సైకిల్‌ చుట్టూ చేరతారు.ఆ వీధంతా నిండిన పూల సౌరభం అతని ఆగమనానికి సంకేతాన్నిస్తుందో లేక సైకిలు బెల్లు అతనిరాకను తెలియజేస్తుందో కానీ సాయంకాలమయ్యేసరికి అతనికోసం ఎదురుచూస్తున్న ఆడవాళ్లు బిలబిలమంటూ హుషారుగా ఇళ్లలోంచి బయటకి వస్తారు పూలబ్బాయి.

ప్రతి ఇంటిముందూ ఆగి ఆప్యాయంగా పలకరిస్తూ మల్లెలు, విరజాజులు.. ఎవరడిగినపూలు వారికిచ్చి ఐదూపదీ..ఎంతిస్తే అంత తీసుకుని అడిగినవారికీ, అడగనివారికీ అందరికీ గులాబీలిచ్చి గంటలో రెండు బుట్టలూ ఖాళీ చేసుకుని చప్పున వెళ్లిపోతాడు.ఎవరికీ అతనిపేరు తెలియదు.పెద్దా చిన్నా అందరికీ అతను పూలబ్బాయేఅతను కొందరికి స్నేహితుడు. మరికొందరికి సన్నిహితుడు. వెరసి అందరికీ పూలబ్బాయి ఆప్తుడని చెప్పాలి. అతనికి మగవారి మనసు తెలుసు, ఆడవారి మనసులోతు తెలుసు.ఒకరోజు రమ హుషారు లేకుండా నిర్లిప్తగా ఉండడంచూసి మనసులో ముల్లుగుచ్చుకున్నవాడిలా ఏంటి చెల్లమ్మా! బావగారి బండి ఇంకా ఇంటికి చేరలేదా?’’ అని అడిగాడు‘‘అవునన్నయ్యా! ఈమధ్య చాలా ఆలస్యంగా వస్తున్నారు. తొందరగా ఇంటికి రమ్మని చెప్పినా వినడం లేదు.’’ అంది రమ బేలగా.

‘‘ఓస్‌, ఇంతేనా!’’ అని పూలబ్బాయి ఆమె మనసులో బాధ ఇట్టే గ్రహించినవాడిలా, ‘‘ఇందా! ఈ మల్లెపూలు చీకటిపడకుండా తలలోపెట్టుకో. ఈ విరజాజులు తెల్లగుడ్డలోచుట్టి రాత్రంతా ఆరుబయట మంచులో ఉంచితే పొద్దున్నకి నవనవలాడుతూ గుబాళిస్తాయి. తెల్లవారే తలస్నానంచేసి విరజాజులు అలంకరించుకుని బావగారు ఆఫీసుకు వెళ్లేటప్పుడు చిరునవ్వుతో శకునం రా. సాయంత్రం ఐదున్నరయ్యేసరికి రతీదేవిలా ముస్తాబై...ఆ తర్వాత నేను చెప్పకూడదు చెల్లమ్మా! ఏం జరుగుతోంది నువ్వే చూడు’’ అన్నాడు.