అప్పటికి నాలుగురోజులుగా, ఆదిత్యకీ, తనకూ మధ్య మాటలులేవు.టైమ్‌కి అన్నీ టేబుల్‌మీద సర్దిపెట్టటమే.ఎవరి పనుల్లో వాళ్ళుంటున్నాం. అలక, కోపం, విసుగు ఉండొచ్చు. కానీ అవి ఎక్కువసేపు ఉండకూడదు. ఒక స్థితిగా మారకూడదు. వాటికో ఫుల్‌స్టాప్‌ పెట్టాలి ఏదో ఒకవిధంగా. దానికి కొంత ఓర్పు...ప్లాన్‌ ఉండాలి.

‘అర్జంట్‌గా మాట్లాడాలి’ అని మెసేజ్‌ పెట్టాను. ఆదిత్య రిప్లై ఇస్తాడని నమ్మకం లేదు. ఆలోచన పక్కకిపెట్టి ఆఫీస్‌ పనుల్లో ఉన్నాగానీ, మాటిమాటికి ఫోన్‌వైపు చూస్తూనే ఉన్నా. ఏకాగ్రత కుదరలేదు.లంచ్‌వరకు చూసి, ఇంక నేనే ఫోన్‌ చేశాను. ‘‘హలో, ఆదీ...’’ సాధ్యమైనంత మెల్లగా, మృదువుగా అన్నాను.‘..................’ఫోన్‌ కట్‌ చేశాడు. మళ్ళీ ఐదు నిమిషాల తర్వాత ఫోన్‌ చేశాను. మళ్ళీ కట్‌ చేశాడు.నాకూ కోపం వచ్చింది. ఏం రాదా? ఇంతలో మెసేజ్‌ వచ్చింది. ‘మీటింగ్‌లో ఉన్నాను, ఇంటికొచ్చాక మాట్లాడతాను’ అని ఉంది. ఎప్పట్లా. ‘జానూ’, ‘జాన్కీ’ ‘జాక్‌’ లాంటివి..మూడ్‌ని బట్టి మారుతూ ఉంటాయి. ఆ పిలుపుని బట్టి... ఆలోచనకూడా తెలుస్తుంది.అవును! ఎలా ఉంటుంది? అంత గొడవయ్యాక.

ఆ రోజూ ఆజ్యం పొయ్యదలుచుకోక ఊరుకుంది. నాలుగురోజులక్రితం, అంతగొడవ పడాల్సిన అవసరమే లేదు. కానీ ఆదికి ఈ మధ్య విసుగు, కోపం ఎక్కువైపోయాయి. ఎదుటివాడు ఏమీ క్వశ్చన్‌ చెయ్యకుండా వేసుకున్న ఆ మాస్కే ఆ విసుగూ, కోపం అని అర్థమైంది. అది ఎప్పుడంటే...విడిచిన బట్టల్లో జేబుల్ని ఆదిత్య జాగ్రత్తగా ఖాళీచేసినాగానీ, వాషింగ్‌ మిషన్‌లో బట్టలేస్తుంటే, జేబులో ఉండిపోయిన ఒక బిల్‌ చూడగానే తను స్టన్‌ అయిపోయింది. అప్పుడే నిలదీసి ప్రశ్నించాలని అనుకుంది. కానీ సరైన సమయం కాదని... ఆగింది. పైగా, దేనికీ దొరక్కుండా, తడుముకోకుండా, తొణక్కుండా జవాబిస్తాడు...నోట్లో అంత రెడీగా ఎలా ఉంటాయో జవాబులు!! అబద్ధం, నిజం ఒక్కలా చెప్పటంతో ఏది నిజమో? ఏది అబద్ధమో? తెలియదు.