ఇది ఇప్పటి సంగతి కాదు.సుమారు నలభైఏళ్ళక్రిందట నాకా ఊరు బదిలీ ఐనప్పటి సంగతి. నాకే కాదు జిల్లా అంతటా బదిలీలు జరిగాయి. కారణం ఎక్కువ ఏళ్ళు ఒకే ఊరిలో ఉన్నారనే. అసలుకారణం రాబోయే ఎన్నికల్లో ఆ ప్రాంతాల్లో ఉపాధ్యాయులు చురుగ్గా పాల్గొనకూడదని.

ఆ బదిలీల ప్రస్థానంలో నాకు మంచి సదుపాయాలున్న ఊరే దొరికింది. ముఖ్యంగా మంచి స్కూలు భవనం, ఉదయం సాయంకాలం ఊళ్ళోకి వచ్చి పోయే ప్రైవేటు బస్సు, మూడుమైళ్ళ దూరంలో రైల్వేస్టేషన్‌, ఒక భోజనహోటలు, రెండు మూడు టీ దుకాణాలు, రామమందిరం, శివాలయం, ఊరు చివరి గ్రామదేవత కోవెలతోపాటు కొబ్బరి మామిడి తోటలు చూడ్డానికి శోభాయమానంగా ఉంటాయి. అంతా బాగానే ఉందిగానీ, నివాసానికి ఒక ఇల్లుకూడా దొరకలేదు. వారం, వర్జ్యాలు చూచుకోవడంలో నేను వెనుకపడ్డాను. నాకన్నా ముందువచ్చిన ఉపాధ్యాయులు, చక్కగా ఇళ్ళు కుదుర్చుకున్నారు. ఆ ఊరునుంచి బదిలీ అయినవాళ్ళు ఇళ్ళు ఖాళీ చేయకుండా, వారాంతపు రాకపోకలు చేస్తూ ఉండటంవల్ల నా సమస్య క్లిష్టమయింది.

భార్య పుట్టింటికిపోయినందువల్ల డ్రాయింగ్‌ మాస్టర్‌ ఇంట్లో నాకు ఆశ్రయం దొరికింది. అలా ఎంతకాలం?ఇంటికోసం చురుగ్గా అన్వేషణ చేస్తుంటే, ఆ రోజు మా స్కూలు ఫ్యూన్‌ వచ్చి, ‘‘మీరుండగలరంటే ఇక ఇల్లున్నాది బాబు. ఇల్లంతా బాగానే ఉంటది. కాని ముందుగది మాత్రం చెమ్మ, చెమ్మగా ఉంటాది బాబు. వీధి వరండా, పెరడు, వంటగది, అయ్యన్నీ బాగానే ఉంటాయి బాబు. ఆ ప్రక్కన శివాలయంపంతులు శివరామయ్యగారు కుటుంబం ఉంటాది బాబు. ఆ ఇల్లు ఆయనదే. సూద్దామంటే ఎల్దామండి’’ అన్నాడు.