ఇంట్లో అందరికీ ఆశ్చర్యంగా ఉంది.నమ్మశక్యం కాకుండా ఉంది. బాధగానూ ఉంది.నలభై ఐదు సంవత్సరాల వైవాహిక జీవితం హరినారాయణ, శాంతమ్మలది. వారికి ఇద్దరు అబ్బాయిలు. పెద్దవాడికి మొదట ఓ అమ్మాయి. ఎనిమిది సంవత్సరాల తర్వాత ఇటీవల ఓ అబ్బాయి పుట్టాడు. రెండో అబ్బాయికి ఓ అమ్మాయి. దాని అల్లరికి భయపడిపోయి ఇంకొకరిని కనటం ఇష్టంలేక ఆపరేషన్‌ చేయించుకున్నారు.

హరి ఐదారు సంవత్సరాలక్రితం రిటైరయ్యాడు. అంతకుముందు ఉద్యోగజీవితానికే పరిమితమయ్యాడు. జీవితాన్నీ, పుస్తకాలనూ బాగా చదివాడు. ఇప్పుడైనా ఆ అనుభవంతో తన పరిధిలో ఉన్న జనాలకు మేలు కలిగే పనులు చేయాలనుకుంటున్నాడు.వారి బంధువులు శాంతను అడుగుతుంటారు.‘‘ఇన్ని సంవత్సరాలు ఇంత ఆప్యాయంగా ఎలా ఉండగలుగుతున్నారు, ఆ రహస్యం మాకూ చెప్పకూడదూ’’ అని అడిగితే,‘‘మీ అందరూ తగాదాలుపడి విడిపోయినట్లు మాట్లాడతారు’’ అనేది.‘‘కనీసం ఒక్కసారన్నా మీరు పోట్లాడుకున్నారా?’’ ‘‘అబ్బే! మేం మనుషులం కాదు’’ అని నవ్వేసి,‘‘అన్నింటికీ ఆ భగవంతుడే ఉన్నాడు. మనం నిమిత్త మాత్రులం’’ అనేది. ఇదీ శాంత సమాధానం.

హరినారాయణ, శాంతలది దండలతోనే పూర్తయిపోయిన పెళ్ళి.వాళ్ల పిల్లల పెళ్ళిళ్ళు అలాగే కూడా నిరాడంబరంగా చేశారు.‘‘కనీసం షష్టిపూర్తి అయినా చేసుకోండి. మా అందరినీ పిలవండి. బట్టలుపెట్టండి. మేం మీకు కానుకలు ఇస్తాం’’ అని దగ్గర బంధువులు ఆట పట్టించేవారు.‘‘అలాంటి సందర్భం వస్తుంది. మా పెద్ద మనవరాలు స్వాతి పెళ్ళి ఘనంగా చేస్తాం. అప్పుడే అన్నీ’’ అంటుంది శాంత.‘‘అంతకాలం బతకమంటావ్‌! ఏమైనా మా క్షేమం కోరతావే శాంతా’’ అని వాళ్ళు అంటే,‘‘పదిహేను సంవత్సరాలు ఎంతలో తిరిగి వస్తాయి. అప్పటిదాకా అందరం ఉంటాం’’ అని సమాధానమిచ్చేది శాంత.

ఈ విషయాలన్నీ హరికి చెప్పేది.‘‘మనం ఎన్నో పెళ్ళిళ్ళకు వెళ్లాం. చాలాచోట్ల ఇతర సందర్భాలకూ వెళ్ళి హాజరయ్యాం. వాళ్ళు అలా అడగటంలో తప్పులేదులే, చూద్దాం’’ అనేవాడు హరి. ఆ తర్వాత శాంత ఆ విషయం మరచిపోయింది. హరికి కొందరు ముఖ్యమైన స్నేహితులున్నారు.