డెహ్రాడూన్‌ చాలా ప్రశాంతమైన హిమాలయ ప్రాంతం. ఒకపక్క ఎత్తైన హిమాలయాలు గంభీరంగా కనిపిస్తూ ఉంటే మరోపక్క సమతలమైన ప్రాంతాలు కనిపిస్తూ ఉంటాయి. ఒకవిధమైన ప్రశాంత గంభీర వాతావరణం అక్కడ పరిఢవిల్లుతూ ఉంటుంది. నేరాలసంఖ్య తక్కువే! అక్కడి జనంలో చట్టం అంటే భయమే కాకుండా, ఒక బాధ్యత కూడా కనిపిస్తూ ఉంటుంది. మత సంఘర్షణలు జరిగిన దాఖలాలు కూడా పెద్దగా కనబడవు డెహ్రాడూన్‌ చరిత్రలో.

కానీ ఒక దొమ్మీ జరిగడం అందులోనూ ఒక హత్య జరగడం ఇదే మొదటిసారి. ఐ.పి.ఎస్‌ శిక్షణ పూర్తయిన వెంటనే ఎ.సి.పి.గా డెహ్రాడూన్‌లో పోస్టింగ్‌ వచ్చింది హృషీకేశ్‌కి. అతను అక్కడ పదవీ బాధ్యతలు చేపట్టి రెండు నెలలైంది. తన పరిధిలో ఉన్న ప్రాంతాలగురించి మెల్లమెల్లగా పట్టు సంపాదిస్తున్నాడు. అయితే అతను సర్వీస్‌లో చేరిన తర్వాత తన పర్యవేక్షణలో ఉన్న ప్రాంతంలో ఇంత పెద్దస్థాయిలో గొడవ జరగడం ఇదే మొదటిసారి.ఆ రోజు ఉదయం పదకొండుగంటల ప్రాంతంలో సి.ఐ. చెప్పిన న్యూస్‌ వింటూనే అలర్ట్‌ అయ్యాడు ఎ.సి.పి. హృషీకేశ్‌. సంఘటన జరిగిన ప్రదేశానికి బయలుదేరారు వెంటనే. అప్పటికే అక్కడ జనం గుమిగూడి ఉన్నారు. ఒళ్ళంతా దెబ్బలతో ఒక యువకుడు రోడ్డుమీద పడివున్నాడు. అతడి ముఖకవళికలనుబట్టి చూస్తే, ముస్లిం యువకుడని తెలుస్తోంది. కొనవూపిరితో ఉన్నాడు. దాదాపుగా పదిహేనుమంది గట్టిగా కొట్టినట్టు అక్కడివారు చెబుతున్నారు. వెంటనే హాస్పిటల్‌కి పంపించే ఏర్పాట్లు చేశారు. కానీ చూస్తూండగానే హృషీకేశ్ చేతుల్లోనే ఆ యువకుడి ప్రాణం పోయింది.

‘‘ఆ యువకుడు తప్పుచేసి ఉంటే అతన్ని శిక్షించడానిఝకి చట్టాలు ఉన్నాయి. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే హక్కు మీకెవరికీ లెదు. చట్టానికి సహకరించండి. ఈ యువకుడిపై దాడిచేసినవారెవరో తెలియచెయ్యండి. సమాచారం అందించిన వారి వివరాలు ఇంకెవరికీ తెలియకుండా చూస్తాము.’’ అని అక్కడున్న జనానికి చెప్పాడు హృషీకేష్‌. అందరూ ముఖముఖాలు చూసుకున్నారుగానీ ఏ ఒక్కరూ పెదవి విప్పలేదు. ‘ప్రజలు జోక్యం చేసుకోలేదు అంటే ఏమో అనుకోవచ్చు కానీ అక్కడ డ్యూటీలో ఉన్న పోలీసులు కొంచెం ముందుగా వచ్చి ఉంటే ఆ యువకుడి ప్రాణాలు కాపాడి ఉండేవాళ్ళం కదా’ అని ఎన్నోసార్లు అనుకున్నాడు హృషీకేశ్‌.