కూతురి పెళ్లయిన మూడోరోజే ఆ కుటుంబానికి ఊహించని గట్టిదెబ్బ తగిలింది. సరిగ్గా మూడు రోజుల తర్వాత భార్యను ఇంటిదగ్గర దిగబెట్టి వెళ్ళిపోయాడు పెళ్ళికొడుకు. మళ్ళీ ఫోన్‌ కూడా చెయ్యలేదు. ఆ భార్య ఎన్నిసార్లు భర్తకు ఫోన్‌చేసినా, అతడి సెల్‌ఫోన్‌ పని చెయ్యలేదు. ఆమె కంగారుపడటం చూసిన తండ్రి.. అల్లుణ్ణి కలుద్దామని సిటీకి వెళ్ళాడు. అప్పుడు తెలిసింది అసలు విషయం. పెళ్ళికొడుకు తరుపు వాళ్ళెవరూ ఆ ఇంట్లో లేరు...! అది అద్దెకు తీసుకున్న ఇల్లు!.. చివరకు ఏం జరిగిందంటే..

*****************************

ఆ గదిలోకి అడుగుపెడుతూనే శైలజ కొన్ని క్షణాలు విభ్రమానికి లోనైంది. గోడలమీద మూడువైపులా అందమైన పెయింటింగ్స్‌, నేలమీద పరిచివున్న ఖరీదైన టైల్స్‌, ఓ పక్కగా పెద్దస్టాండ్‌ మీద వున్న అక్వేరియం...ఆమెను ఆశ్చర్యపరిచినవి ఇవేవీ కాదు, ఆ గది సీలింగ్‌! అది చాలా ప్రత్యేకంగా ఉంది. అచ్చం ఆరుబైట ఉన్నట్టుగా పైన చుక్కలు వెలుగుతున్నాయి. మధ్యలో చంద్రుడు కూడా సరిగ్గా చందమామ ఉన్నట్టే డిజైన్‌ చేసి వెలుగులీనుతోంది. అదాటున చూస్తే ఎవరైనా ఆరుబైట ఆకాశంక్రింద నిలబడి ఉన్నామేమో అనుకునేట్టుగా ఉంది ఆ గది సెట్టింగ్‌. ఏ.సి. నిశ్శబ్దంగా పనిచేస్తోంది. ఆ గదిలో చల్లని తెల్లని కాంతులు, ఆకాశం నుండి ప్రసరిస్తున్నట్టే ఉంది. పైన వెలుగుతున్న చుక్కలకాంతిని క్రింద ఫ్లోరింగ్‌ ప్రతిఫలింపజేస్తోంది.

 

 

గది మధ్యలో సిక్స్‌ బై సిక్స్‌ డబుల్‌కాట్‌ బెడ్‌! దాన్ని బెడ్‌ అనే కంటే రాజరికపు శయ్య అంటే సరిపోతుంది. ఆ మంచంచుట్టూ పైనుంచి క్రిందకు మల్లెలు మరువం కలిపి గుచ్చిన దండలు వేలాడుతున్నాయి. మంచంపై చక్కటి డిజైన్‌తో ఉన్న లేత నీలిరంగు ముఖమల్‌ దుప్పటి పరిచి ఉంది. అదే రంగు తలదిండ్లు, పరుపు నిండా వెదజల్లిన మల్లెలు. పక్కనే టీపాయ్‌ మీద స్వీట్లు. ఆ పక్కనే స్టాండ్‌కిగుచ్చి వెలుగుతున్న అగరొత్తులు గదంతా శ్వేతవర్ణపు ధూమాన్ని వ్యాపింపచేస్తున్నాయి. ఘుమఘుమలాడించే వాసనతో మత్తెక్కిస్తున్నాయి.

బెడ్‌ మీద తెల్లని లాల్చీ పైజమా ధరించి కూర్చుని ఉన్నాడు అతడు. అతడివైపు సూటిగా చూడలేక తలక్రిందకు దించుకుని ఉంది శైలజ. ఆమెను చూడగానే లేచి దగ్గరకొచ్చాడతడు. చిన్నగా నవ్వుతూ ఆమె భుజాలమీద చేతులు వేశాడు. ఆమెలో గుండె ఝల్లుమనిపించే కలవరం. సుతారంగా ఆమె బుగ్గమీద తన అరచేత్తో రాశాడతను. ఆమె రక్తనాళాల్లోని రక్తం వడివడిగా పరుగెత్తింది. అంతలోనే ఆ సరస సన్నివేశానికి రసభంగం కలిగిస్తూ బైట ఎవరో తలుపు తడుతున్న చప్పుడు!