సంక్రాంతి పండుగ రోజులు.తెలుగు గ్రీటింగ్‌ కార్డుల హడావుడి.ఈ - మెయిల్స్‌, ఈ - గ్రీటింగ్స్‌కు రోజులు చెల్లిపోయి, సందేశాలని చేత్తో రాసి సంతంకం పెట్టి పంపే వాళ్ళు పెరుగుతున్న రోజులు. మానవ సంబంధాలలో మళ్ళీ మరో నూతన ఆధ్యాయం మొదలవుతున్న నేపథ్యం.సాయంత్రం బహుశ ఎనిమిది ఆ ప్రాంతాల్లో అనుకుంటా, కొంచెం ఖాళీ దొరికింది. అప్పటిదాకా నిలబడి ఉన్నానేమో కాసేపు కూర్చుందామని కాష్‌ కౌంటర్‌ పక్కనేవున్న కుర్చీలోకూలబడ్డాను.

అప్పుడే వాళ్ళిద్దరూ లోపలికి వచ్చారు. ఒత్తుగా నల్లని జుట్టు, గుండ్రటి మొహం, సిగరెట్టు అలవాటున్నట్టు లేదు .. పెదవులు ఎర్రగానే ఉన్నాయి. కొంచెం లావుగానే కనపడ్డా ఆరోగ్యంగా, దబ్బపండు చాయతో పచ్చగా మెరిసి పోతున్నాడు. సిల్కు లాల్చి, పైజమా, మెడలో సన్నటి బంగారం గొలుసు. పాదాలకు కొల్హాపూర్‌ చెప్పులు. చూస్తే .. మొత్తం మీద కొంచెం అహంకారంతో కూడిన ఆత్మవిశ్వాసంతో ఉన్న మనిషిలాగా కనబడ్డాడు.అతనితో పాటు ఆమె.ఆ ముఖం ఇది వరకు చూసినట్టే ఉంది. ఒత్తయిన జుట్టు. మధ్యకి తీసిన పాపడి మీద సింధూరం. కనుబొమల మధ్య గుండ్రంగా ఉన్న ఎరుపు రంగు, చిన్న స్టికర్‌ బొట్టు. మెడలో డిజైనర్‌ మంగళ సూత్రం. నీలం రంగు చీర. పసుపచ్చరంగు జాకెట్టు, దాని చేతులకు ఆకర్షణీయమైన ఎంబ్రాయిడరీ.

ఆమె కుడి చేతి వేళ్ళు అతని ఎడమ చేతి వేళ్ళతో పెనవేసుకుని ... చేతులకి బంగారం గాజులతో పాటు రంగు రంగుల గాజులు. కాళ్ళకు పట్టీలు. అడుగు వేస్తుంటే మృదువుగా, మధురమైన సన్నని రవళి.ఆ! ఇప్పుడు గుర్తు వచ్చింది. ఆమె ఇదివరలో షాపుకు వచ్చేది, పుస్తకాలు కొనుక్కోవడానికి. గ్రీటింగ్‌ కార్డులు కూడా కొనుక్కునేది. అప్పుడప్పుడు తన స్నేహితులతోను, తల్లిదండ్రులతో కూడా వచ్చేది. నేను కుర్చీలో నుంచి లేచే లోపు తనే పలకరింపుగా నవ్వింది. నేను గుర్తించాను అన్నట్టుగా నవ్వాను. షాపు పరిచయమేగా ... ఆమె తిన్నగా పుస్తకాల అలమరల దగ్గిరకి వెళ్ళిపోయింది.అతను అటూ ఇటూ చూసి కార్డుల వైపుకి వెళ్ళాడు. సరిగ్గా అదే సమయానికి ఒకేసారి ఒక పది మందిదాక వచ్చేసారు షాపులోకి. పిల్లలు, వాళ్ళతో పాటు పెద్దవాళ్ళు కూడా.