జనవరి నెల...చలి విపరీతంగా వుంది.అతడు... ఖరీదైన కారులో వచ్చి జూబ్లీహిల్స్‌లోని ఓ ఆధునిక భవనం ముందు దిగాడు. రెండెకరాల విస్తీర్ణంలో వున్న ఆ భవంతి ముందు దాదాపు అర ఎకరం పూల తోట ఉంది. అతణ్ణి చూడగానే దాదాపు పది మంది దాకా పనిమనుషులు వచ్చి చేతులు కట్టుకొని వినయంగా నిల్చున్నారు. అతడు వాళ్లందరినీ చిరునవ్వుతో, కళ్లతోనే పలకరిస్తూ లోపలకి నడిచాడు.

ఆ భవంతి రాజాపురం సంస్థానాధీశులది. రాజాపురం విడిచిపెట్టిన తర్వాత రాజావారు హైదరాబాద్‌లో సెటిలయ్యారు.విశాలమైన హాలు... హాలులో రెండు వైపుల్నుంచి వచ్చి ఒక్కటైన మెట్లు. మధ్యలో ఉన్న పెద్ద సోఫాసెట్లో అతను ఏ బెరుకూ లేకుండా కూర్చున్నాడు. పైనించి రాజా వారు ఒక్కొక్క మెట్టూ దిగుతూ వచ్చారు. నుదుట పొడువైన కుంకుమబొట్టు, రంగు వెలసిన గుబురు మీసాలు, చింతనిప్పుల్లాంటి కళ్ళు... మెడలో రుద్రాక్షల దండ... కుడి చేతిలో బంగారంతో మలచబడి వజ్రాలు పొదిగిన చేతికర్ర... వయసుతో పాటు సంపద తెచ్చిన పెద్దరికం... రాజావారి హుందాతనం కంటే ఆయన ఆహార్యం ఎక్కువ భయాన్ని తలపింపజేసేలా ఉంది.హాలు గోడలపై బంగారంతో చేయించిన సంస్థాన రాజముద్ర కన్పిస్తుంది.

వందల ఏళ్లనాటి షాండిల్స్‌... వేలాడదీసిన కత్తులు... ఇటలీలో ప్రత్యేకంగా తయారు చేయించి తెప్పించిన పోర్సిలీన్‌ టీ సెట్‌లు, ఆ కాలంలోనే ఈజిప్ట్‌ మూలకెట్‌ స్టోన్‌తో రూపొందిన విగ్రహాలు... రష్యా నుండి తెప్పించిన బాకేరి ప్లేట్లు... టర్కీనించి తెప్పించిన ఫ్లవర్‌ వాజ్‌లు... ఇళ్లంతా సంస్థాన చారిత్రిక జ్ఞాపకాలతో నిండివుంది.అతడు లేచివెళ్లి రాజావారి పాదాలకు వంగి నమస్కరించాడు.ఇద్దరి మధ్య కాసేపు మౌనం ...పనిమనిషి .. నగీషీలు చెక్కిన కప్పుల్లో కాఫీ తెచ్చిపెట్టింది.అతడే ముందుగా గొంతు విప్పాడు ...‘‘ఈ మధ్య కోట కెళ్లారా పెద్ద నాన్నా... ’’‘‘లేదురా... కోటలోని రుద్రేశ్వరాలయం కూలిపోతుందట... నూట నలభై రెండెకరాల కోటలో మధ్య భవనం కూడా సగంకెక్కువ శిథిలమైపోయింది. రాణిగారి బంగ్లాలో గబ్బిలాలు స్థావరమేర్పర్చుకున్నాయి. ఆవరణమంతా పిచ్చిమొక్కలు విపరీతంగా పెరిగిపోయాయి. కోట చుట్టూ వున్న ఆరు బురుజులు కూడా సగం కూలిపోయాయి. దట్టమైన చెట్ల గుబుర్లు, పిచ్చి మొక్కలు పెరిగి భయంకరంగా అయిపోయాయి.’’