వాళ్ళిద్దరికీ పెళ్ళికుదిరింది. సెల్‌ఫోన్‌ నెంబర్లు ఇచ్చిపుచ్చుకున్నారు. ఆనందంగా మాట్లాడుకుంటున్నారు. అందం తెలివితేటలు సొంతం చేసుకున్న యువతి భార్య కాబోతోందని అతడు మురిసిపోయాడు. కానీ అంతలోనే అనుకోని అవాంతరం. టీ.వీల్లో ఫ్లాష్‌ న్యూస్‌లూ, వీడియో క్లిప్పింగులూ! అతడు ఆలోచనలో పడ్డాడు. ఆమె షాక్‌ తింది. స్నేహితులు ఆమె ఇంటికి వెళ్ళి, ఏమిటే ఇది! అంటూ ఆరాటపడసాగారు. ఇంతకీ ఏమిటా వీడియో? అసలేంజరిగింది?

ఒక్క అందంలోనేకాదు, తెలివితేటల్లో సైతం పదుగురితో భేష్‌ అనిపించుకున్న పునీతను పరిణయమాడేందుకు ముందుకురాని మహాశయుడంటూ ఎవడైనా ఉన్నాడంటే అతగాడో కొయ్యబొమ్మే!కాని కౌశిక్‌ కొయ్యబొమ్మ కాదు. జీవమున్నవాడు కాబట్టే పునీత అందచందాలను పొందేందుకు జీవితంలో తన అర్ధాంగి పీఠం అలంకరించేందుకు హృదయపూర్తకంగా ఆహ్వానించాడు. అది పునీత అదృష్టమో, అతడికి పట్టిన యోగమో ఏదైనా అవనీగాక వారిద్దరి వివాహం ఖాయమైంది.చందనరావుకు పునీత ఏకైక కుమార్తె. ఒకప్పుడు ఉమ్మడికుటుంబంలో బాధ్యతలు, భార్య అకాలమరణం వంటికారణాలవల్ల పునీత వివాహం కొద్దిగా ఆలస్యమే అయ్యింది. రిటైరయ్యేదాకా ఆ ప్రయత్నమే చేయలేక పోయాడు చందనరావు. అబ్బాయి కౌశిక్‌ యోగ్యుడు కావటంవల్ల, ఇంత కావాలని రొక్కించి కట్నకానుకలకోసం ఒత్తిడి తేనందువల్ల పునీత పెళ్ళి ఏర్పాటు చేయడానికి ముందడుగేశాడు.

తన వివాహం తండ్రికి భారం కాకూడదనే ఉద్దేశంతోనే, కొంతకాలం ఏదైనా ఉద్యోగంచేసి, తండ్రికి ఆర్థికంగా సహయపడతానంది పునీత. ఇప్పుడు పెళ్ళి వాయిదావేస్తే కలసివచ్చిన సంబంధం కాలదన్నుకున్నట్లవుతుందని పిల్ల పెళ్ళికే మొగ్గు చూపాడు చందనరావు.వివాహముహూర్తం ఇలా పెట్టారో లేదో మరుక్షణమే పునీత, కౌశిక్‌లు సెల్‌ నంబర్లు ఇచ్చిపుచ్చుకున్నారు. ఈ లోపే కొంత అనుబంధం బలపడుతుందని వారిద్దరి నమ్మకం! అలా వారి హృదయాల్లో వెన్నెలలు విరియడం మొదలైంది. కాని, విధి బలీయమైంది. అందరినీ అలరించే చిత్తరువు మీదనే బురదజల్లి అల్లుకుపోయేలా చేయడం, విస్తారంగా పండిన పంటచేతికొచ్చే సమయంలో మహావర్షం కురిపించి రైతుకంట కన్నీరొలికించటం ఆ దేముడికి మామూలు విషయం కాబోలు! పునీత జీవితంలో ఆనందం పరవళ్ళు తొక్కుతున్నవేళ సరిగ్గా ఆ వార్త! ఫోన్‌ చేసింది సన్నిహితురాలు కల్పన. ‘‘పునీతా! ఓ బ్యాడ్‌ న్యూసే!’’