ఒకానొకప్పుడు విదేహదేశాన్ని విరూపుడనే రాజు పరిపాలించేవాడు. జనం మేలుకోరి ఆయన ఎన్నో సంస్కరణలు ప్రవేశపెట్టాడు. కానీ రాజ్యంలో పేదరికం తొలగిపోవడం లేదు. ధనికులు నానాటికీ ధనికులు అవుతూంటే పేదలసంఖ్య క్రమంగా పెరుగుతోంది.

విరూపుడు ఒకరోజున మంత్రులందర్నీ సమావేశపరచి, ‘‘దేశంలో ఒక్కరు కూడా పేదరికంతో బాధపడకూడదు. డబ్బు కొందరివద్ద మరీ ఎక్కువగానూ కొందరివద్ద మరీ తక్కువగానూ ఉండకూడదు. ఇందుకు నేనేంచేయాలో చెప్పండి’’ అనడిగాడు. అప్పుడు మంత్రులందరిలోకీ వృద్ధుడైన జ్ఞానసిద్ధి, ‘‘ప్రభూ! ఎక్కడైనాసరే సామాన్యప్రజల్లో కొందరు మరీ అమాయకులుంటారు. వారికి మనం ఎన్ని సదుపాయాలు చేసినా సరిగా ఉపయోగించుకోకుండా, తాము కూడా కలిగినవారికే సాయపడుతూంటారు. అందువల్ల మీ కోరిక సాధ్యపడదు’’ అన్నాడు రాజుతో.ఈ మాటలకు విరూపుడు బాగా నొచ్చుకున్నాడు. ‘‘ఇంతమంది మంత్రులున్నారు. ఉన్నవారివద్ద ఎక్కువైన డబ్బు తీసుకుని, లేనివారికి పంచిపెట్టే మార్గం ఒక్కటైనా సూచించలేరా?’’ కొంచెం కోపంగానూ, బాధగానూ అడిగాడు.

జ్ఞానసిద్ధి ముఖం గంభీరంగా మారింది. ఆయన నెమ్మదిగా, ‘‘దానికేముంది ప్రభూ! ‘ఒక మనిషివద్ద ఇంతకుమించి డబ్బుండరాదు. ఉంటే కనుక ఆ అదనపు డబ్బుని ప్రభుత్వమే తీసేసుకుంటుంది’ అని మనం ఒక శాసనం చేయవచ్చు. అలా తీసుకున్న డబ్బును మనం పేదవారికి అందజేసే ఏర్పాటు చెయ్యవచ్చు. ఎటొచ్చీ అందువల్ల దుష్పరిణామాలు కలగవచ్చు’’ అన్నాడు. ‘‘పేదవాళ్లకు ధనసాయం చెయ్యడంవల్ల పౌరులకు మేలు జరగాలి కానీ దుష్పరిణామాలుంటాయని మీరనడం ఆశ్చర్యంగా ఉంది’’ అన్నాడు విరూపుడు.

దీనికి జ్ఞానసిద్ధి నవ్వి, ‘‘ఇందులో ఆశ్చర్యపడాల్సినదేముంది ప్రభూ! సమర్థ్ధుడైన వ్యక్తికి ఇంకా ఇంకా సంపాదించాలని ఉంటుంది. ఆందుకని ఎక్కువగా శ్రమ పడతాడు. అలా దేశంలో ఉత్పాదన పెరుగుతుంది. ఒక మనిషివద్ద ఇంతకుమించి డబ్బు ఉండరాదని శాసనం చేస్తే, సమర్ధుడికి సంపాదనపట్ల ఆసక్తి తగ్గుతుంది. శ్రమ తగ్గించి తన ఆదాయం తగ్గించుకుంటాడు. అందువల్ల సమర్థుడి శక్తి సామర్ధ్యాలు దేశానికి పూర్తిగా ఉపయోగపడకుండా పోతాయి. అలాగే పేదవాడికి ఊరికే డబ్బిస్తే అతడిలో సోమరితనం ప్రబలిపోతుంది. కాబట్టి దేశంలో అంతా సరిసమానంగా ఉండాలంటే మీరు చెప్పిన ఉపాయం దుష్పరిణామాలకు దారి తీస్తుంది’’ అన్నాడు .