దుర్గమమైన అరణ్యం ఆవలున్న మారుమూల గ్రామం అది. ఆ రాజ్య మహారాజు కూడా ఆ గ్రామాన్ని నిర్లక్ష్యం చేశాడు. అందుకే అక్కడి ప్రజల బతుకులు బాగుపడలేదు. తమ పాలకుడైన మహారాజుకంటే, పుణ్యపురుషుడైన ఆ శ్రీరాముడినే ఎక్కువగా విశ్వసించారు ఆ గ్రామ ప్రజలు. చురుకైన ఆ గ్రామ యువకుడొకడది గ్రహించాడు. తన గ్రామస్థులకు మేలుచేయాలనుకున్నాడు. అందుకు అతడేం చేశాడు?

శాపవరం గ్రామంలో శూరసేనుడనే యువకుడు ఉండేవాడు. అతడు మహా సాహసి. అతడికి రాని యుద్ధవిద్య లేదు. పద్దెనిమిదేళ్ల వయసు రాగానే, శూరసేనుడు తన తండ్రి వినయుడితో, ‘‘నాకు సామాన్యుడిలాగా జీవించాలని లేదు. పదిమందికీ ప్రయోజనం కలిగే విశేషం ఏదైనా సాధించాలని ఉంది’’ అన్నాడు.వినయుడు కూడా అందుకు ఎంతో సంతోషించి, ‘‘నీ బుద్ధి సరైనమార్గంలో ఉంది. పదిమందికోసం బ్రతకడంలోనే మనిషి సంతోషం ఉంది. నువ్వు పుట్టిపెరిగిన ఈ ఊళ్లో కటికదరిద్రులే ఎక్కువమంది. భాగ్యవంతులు బహుకొద్దిమంది. ఆ భాగ్యవంతులు కూడా దుర్మార్గులు కారు. కానీ, తమకున్న సంపదతో దరిద్రులను ఆదుకునే దశలో లేరు. మన ఊరు శాపగ్రస్థమైనదని అంతా అంటారు.

ఇక్కడికి చేరాలంటే దుర్గమారణ్యం దాటాలి. కొండమార్గాలు పట్టాలి. అందుకే దేశాన్ని ఏలే మహారాజు కూడా మన గురించి పట్టించుకోవడం లేదు. అందుబాటులో ఉన్నది సంపాదించుకుని, తిని బ్రతకడంతప్ప, మన గ్రామస్థుల్లో బయటి ప్రపంచం చూసినవారు తక్కువ. కాబట్టి, నువ్వు కష్టపడి ప్రయాణం చేసి, రాజధానికి చేరుకుని, మహారాజును కలుసుకుని, మన గ్రామం గురించి విన్నవించు. ఆ తర్వాత ఆయనే మనల్ని కాపాడతాడు. నీ పేరు చెప్పుకుని గ్రామస్థులు అందరూ సుఖపడతారు’’ అని చెప్పాడు.ఆ దేశాన్ని ఏలే మహారాజు సింహబలుడు. ఆయన దయాశీలుడని చెప్పుకుంటారు. ఆయన పాలనలో నెలకు మూడువానలు కురుస్తాయనీ, ప్రజలకు ఆకలి అన్నది తెలియదనీ వాడుక. తమ గ్రామం సంగతి రాజుకి తెలిస్తే అక్కడి పరిస్థితులు చక్కబడతాయని శాపవరం గ్రామస్థులు నమ్ముతున్నారు.

అయితే ఎవరూ పల్లె దాటి వెళ్లి రాజును కలుసుకునే సాహసం చేయలేదు. శూరసేనుడు గ్రామస్థులందరినీ కలుసుకుని తనకున్న అభిప్రాయం చెప్పాడు. ఆ గ్రామంలో విశ్లేషణుడనే వృద్ధుడొకడున్నాడు. అంతా అతడి మాట గౌరవిస్తారు. అతడు శూరసేనుడితో, ‘‘శాపగ్రస్థమైనది కాబట్టే, మన ఊరికి శాపవరమన్న పేరు వచ్చింది. ఆ శాపం పోయేవరకూ మనమిలా కష్టపడక తప్పదు. మన గ్రామంలో సహజసంపద ఉన్నది. అది మన మధ్యనే ఉండిపోవడంవల్ల నిరర్థకమైపోతోంది. ఈ సంపదను బయటి ప్రపంచానికి తరలిస్తే, మనకు గొప్ప ప్రతిఫలం లభిస్తుంది. కానీ, ఈ సంపదను బయటి ప్రపంచానికి చేరవేసేది ఎలా? బయటకు వెళ్లడానికి మనకు సుగమమైన మార్గం లేదు. కాలం కలసివచ్చిన రోజున ఆ మార్గం దానంతటదే ఏర్పడుతుంది. అంతవరకూ మనం ఎదురుచూడకతప్పదు. ఈ లోగా, మహారాజును కలుసుకున్నా ప్రయోజనం లేదు. ఆ ప్రయత్నం మనకు ఉపకరించదు’’ అన్నాడు.

‘‘అయితే, నేనేం చేయను?’’ అన్నాడు శూరసేనుడు. ‘‘రాత్రి పడుకునేముందు ప్రజాహితం గురించే ఆలోచించు. అప్పుడు కర్తవ్యం నీకు కలలో గోచరిస్తుంది’’ అన్నాడు విశ్లేషణుడు. శూరసేనుడు అతడు చెప్పినట్టే చేశాడు. ఆ రాత్రి అతడికి శ్రీరామచంద్రుడు కలలో కనబడి, ‘‘శాపవరానికి పశ్చిమదిశలో ఒక పురాతన ఆలయం ఉంది. అందులో నా విగ్రహం ఉంది. రెండువందల సంవత్సరాల క్రితం, మీ శాపవరం గ్రామస్థుడు నాపట్ల అపచారం చేశాడు. అప్పటినుంచీ మీ గ్రామం బయటి ప్రపంచంనుండి వేరు పడింది. అందువల్ల, నాకు పూజాపునస్కారాలు లేకుండా పోయాయి. నువ్వు నా ఆలయాన్ని కనుగొని పునరుద్ధరించు. నా గురించి ప్రచారం చేయి. నన్ను సేవించుకునేవారికి ఏవిధమైన కష్టాలూ ఉండవు. కాబట్టి నీకూ, నీ గ్రామస్థులకూ శుభం జరుగుతుంది’’ అన్నాడు.