అర్ధరాత్రి మెలకువొస్తుంది. వున్నట్టుండి లేస్తావు. మూత్రం వస్తున్నట్టుగా శరీరంలో వొక అసౌకర్యమైన చలనం. అటు తిరిగి పడుకొని వున్న శాంతికి నిద్రాభంగం కాకూడదన్న ఇంగితం కూడా లేకుండా పెద్ద చప్పుడు చేసుకుంటూ, బాత్‌రూమ్‌కి వెళ్తావ్‌. పైజామా కిందికి లాగి, కొంచెం సేపు ప్రయత్నిస్తావ్‌. కొన్ని చుక్కలు పైజామా మీద పడుతూ వుంటాయి చివర్లో - అది నీకు అసహ్యం. అంత అపరిశుభ్రంగా ఎప్పుడూ లేవు నువ్వు. మరి ఇప్పుడు?! శరీరం అదుపులో లేదు. ఆరోగ్యం గాడి తప్పింది. అన్నిటికీ నెపం కాసేపు ఫిలడెల్ఫియా దిక్కుమాలిన బతుకు మీదకి తోసేస్తావ్‌ కదా!వొక పట్టాన నిద్రపట్టదు. నెమ్మదిగా వెనక్కి వచ్చి, లివింగ్‌ రూమ్‌లోకి వెళ్తావ్‌. కిటికీ తెరచి, వీధిలోకి చూస్తావ్‌. అదేమీ నీ వూళ్ళో వీధి కాదు కదా, రహదారి అంతా ప్రశాంతత పొంగి ప్రవహించడానికి - ఆ వీఽధిలో నీ కుటుంబానికి ఎంత గౌరవం! దిక్కుమాలిన ఈ దేశంలో ఈ నగరంలో శాంతి పనిచేసే ఆఫీసుకి దగ్గరగా వుండాలనుకొని, సిటీలోనే ఈ బ్లాక్‌లోకి వచ్చిపడ్డావ్‌. మొదటే ఈ చుట్టు పక్కల ఏదీ నీకు నచ్చలేదు. ఇద్దరు పిల్లలు - సిరికీ, శౌరికీ - ఈ రెండేళ్లలో హైస్కూల్‌ అయిపోతే రేపు యూనివర్సిటీకి కూతవేటు దూరంలో వుంటారన్నది తప్పితే. నీ వుద్యోగం విషయానికి వస్తే న్యూజెర్సీ, డెలవేర్‌ నగరాలకు షటిల్‌ తప్పదు. నిలకడ లేదు. అన్ని విధాలా శాంతి వుద్యోగమే స్థిరం. కుటుంబం కోసం కొన్ని త్యాగాలు తప్పవ్‌. ప్రశాంతమైన సబర్బ్‌ జీవితాన్ని వదులుకోవడం అందులో వొకటి. సబర్బ్‌లో వుంటే మనవాళ్ళ మధ్య బతుకుతున్న ఫీలింగ్‌. ఇక్కడ.. ఈ నగరం మధ్యలో?! ‘‘వచ్చేయ్‌ వచ్చేయ్‌.. దూరమైనా పర్లేదు. శాంతి డ్రైవింగ్‌ నేర్చుకుంటుందిలే!’’ అని సబర్బ్‌ దోస్తుల వొత్తిడి. ‘‘నేను డ్రైవింగ్‌ చేస్తా’’ శాంతి భరోసా ఇచ్చినా, నీకు భయం.అన్నీ భయాలే. అన్నిటికంటే పెద్ద భయం నువ్వు ఎవరికీ తెలీకపోవడం. ఇన్ని నల్ల ముఖాల మధ్య వొక గోధుమ రంగు నీడ నువ్వు. శాంతికి ఇలాంటి భయాలు ఎందుకు లేవు? వర్క్‌లో బ్లాక్స్‌, లాటిన్‌ అమెరికన్స్‌, మిడిల్‌ ఈస్ట్‌ వాళ్లమధ్య తనకి అంత సఖ్యం ఎలా సాధ్యం?! ఏమో?!

                                              ***********************************************************