ఇవాల్టి ఉదయం జరిగిన సంఘటన గుర్తొచ్చింది. హైదరాబాదులో రేపు జరగబోయే మీటింగుకి సంబంధించి ఆఫీసు ఫైల్సు, పేపర్లు సర్దుకున్నాను. లంచ్‌కి ఇంటికెళ్ళడానికి ఇంకా టైము ఉండడంతో యథాలాపంగా ఫేస్‌బుక్‌లోకెళ్ళాను.కమల ఫోటోకి ‘యూ ఆర్‌ టూ హాట్‌’ అన్న కామెంటు చూసి అదిరిపడ్డాను. జగన్‌ అన్నవాడు చేసిన కామెంటు అది. అతడెవరై ఉంటారా అని ఆలోచించాను గానీ, ఎవరో తెలీలేదు. పెళ్ళయిన అమ్మాయి గురించి అలాంటి కామెంట్‌ చేశాడంటే అతడు కేవలం ఫ్రెండే అయ్యుంటాడా, లేక...!గబగబా కమల తాలూకు ఫోటోలన్నీ చూశాను. నేనెన్నడూ సీరియస్‌గా చూడలేదుగానీ అన్నింటికి అతగాడు ఏదో రకమైన ఘాటు కామెంట్లు పెట్టాడు.‘‘జగన్‌ ఎవడు?’’ ఇంటికెళ్తూనే కమలని నిలదీశాను...
**********************

ఆ ముసలావిడకి దగ్గర దగ్గర ఎనభై ఏళ్ళుంటాయి. నడుం బాగా వంగిపోయింది. భక్త శబరిలా ఉంది. కొడుకో, మనవడోగానీ, అతడి సాయంతో అతికష్టంమీద మా బోగీలోకి ఎక్కింది.నా గుండెలు ఝల్లుమన్నాయి. రైల్వేవారు ఆవిడకి ఖచ్చితంగా అప్పర్‌ బెర్తే కేటాయించి ఉంటారు. చుట్టూ ఉన్న వీళ్ళంతా కలిసి నా లోయర్‌ బెర్త్‌ ఆమెకి ఇప్పించిగానీ నిద్రపోరు. నాకిక సుఖంగా పడుకుని ప్రయాణించే యోగం లేనట్టే!

ముఖం మాడ్చుకుని దిక్కులు చూస్తుంటే వాళ్ళు తిన్నగా నా బెర్తు దగ్గరకే వచ్చేశారు.‘‘ఒరేయ్‌, ఇదేదో నీ అత్తగారి ఇల్లైనట్టు కాళ్ళు చాచుకుని కూర్చున్నావేంట్రా. తిన్నగా కూర్చో. పెద్దదానికి చోటివ్వాలన్న ఇంగిత జ్ఞానం కూడా నీకు లేదట్రా’’ రూపం శబరిలాఉన్నా లంకిణిలా కసిరింది.ఒక ప్రక్కకి జరిగి కూర్చున్నాను.‘‘ఎవరైనా పై బెర్తుకి మారతారా ప్లీజ్‌...’’ ఆవిణ్ణి తీసుకొచ్చినతను అందరివంకా చూస్తూ అడిగాడు.విననట్టు ఉండిపోయాను.‘‘ఒరే...నీ సీటేదిరా’’ ముసిల్ది నన్నడిగింది.‘‘ఇదే..’’ హీనస్వరంతో జవాబిచ్చాను. ‘‘వీడు వెళ్తాడు లేరా, నువ్వలా కూర్చో...’’నేను భయపడిందే జరుగుతోంటే భరించలేకపోయాను. ‘‘నాకు మోకాళ్ళ నొప్పులు. పైకెళ్ళలేను. నిద్దట్లో కండరాలు పట్టేస్తాయి’’ గబుక్కున అబద్ధమాడేశాను.ఆవిడ బుగ్గలు నొక్కుకుంది. ఆ పైన చోద్యంగా చూసింది.

‘‘ఈ వయస్సులో మోకాళ్ళ నొప్పులేవిట్రా, ఏకంగా సముద్రాలు దూకాల్సిన వాడివి. అయినా ఒళ్ళు వంగకుండా కూర్చుంటే ఇలాంటి రోగాలే వస్తాయి మరి. పడుకునే ముందు ఈ మూల నుంచి ఆ మూలకీ ఆ మూల నుంచి ఈ మూలకీ తిరుగు, కాస్త కాళ్ళు సాగి కమ్మగా నిద్రపోతావు’’.మరిక ఆవిణ్ణి కాదనడానికి ధైర్యం చాల్లేదు. బుర్ర గోక్కుంటూ లోలోపల తిట్టుకోసాగాను.‘‘మొహంలో పేలాలు వేగుతున్నాయేంట్రా. నాకు తెలీక అడుగుతాను. ఇంత స్వార్థపరుడివి పెళ్ళాంతో తిన్నగా కాపురం చేస్తున్నావా, లేక ఎడ్డమంటే తెడ్డెమంటూ రాచి రంపాన పెడుతున్నావా?’’