ఒకానొకప్పుడు భాగ్యవతీనగరం సుసంపన్నమై విలసిల్లేది. ఆ నగరాన్ని ఆనుకొని ప్రచండ అనే గొప్ప నది ప్రవహించేది. ఉవ్వెత్తున లేచి పడే కేరటాలతో అంతులేని ప్రవాహవేగంతో ఆ నది చూపరులకు భయాన్ని కలిగించేది. ఆ నదికి ఆవలివైపున ఏమున్నదో భాగ్యవతీ నగరవాసులు ఎరుగరు. భాగ్యవతీ నగరానికి రాజు భాగ్యసేనుడు. అతడికి లేక లేక పుట్టిన కుమార్తె సులక్షణ. సులక్షణకు యుక్తవయస్సు వచ్చేసరికి, ఏదో తెలియని జబ్బు చేసి మంచం పట్టింది. రాజ వైద్యులు వైద్య గ్రంథాలన్నీ తిరగేసి ‘శోషణ’ అనే మూలికవల్లతప్ప, ఆమె జబ్బు నయంకాదని రాజుకు తెలియజేశారు. అయితే ఆ మూలిక ఎక్కడ దొరుకుతుందో వారు చెప్పలేకపోయారు.

పురాణ గ్రంథాల్లో శోషణ అనే మూలిక ప్రసక్తి ఉన్నది. అది ఆరోగ్యవతీ నగరంలో సమృద్దిగా లభిస్తుందిట. ఆరోగ్యవతీనగరం ప్రచండ నది ఒడ్డున ఉన్నట్లు పురాణగ్రంథాల్లో వ్రాయబడి ఉంది. నిజంగా ఆరోగ్యవతీ నగరమంటూ ఉంటే అది ప్రచండనది ఆవలి ఒడ్దున ఉండాలని అంతా అనుకున్నారు. కానీ నది ఆవలి ఒడ్డుకు వెళ్లడం మానవ మాత్రులకు సాధ్యమయే పని కాదు. భాగ్యసేనుడు కూతురుమీద ఆశలన్నీ వదిలేసుకున్నాడు. కానీ చివరకు, ‘‘శోషణ మూలిక తెచ్చినవారికి సులక్షణనిచ్చి పెళ్ళి చేయడమేకాక, భాగ్యవతీ నగరానికి రాజుగా పట్టాభిషిక్తుణ్ణి చేయగలను’’ అని నగరమంతటా దండోరా వేయించాడు. ఇది విన్నప్పటికీ భాగ్యవతీనగర పౌరులెవ్వరూ ఉత్సాహపడలేదు.

ఈ ప్రకటన ఆనోటా ఆనోటా ప్రాకి చివరకు కారాగారంలో ఉన్న ప్రతాపుణ్ణి చేరింది.ప్రతాపుడు మహావీరుడు. సాహసి. అతడికి సులక్షణ అంటే చెప్పలేనంత ప్రేమ. పెళ్ళంటూ చేసుకుంటే ఆమెనే చేసుకోవాలని కలలు కనేవాడు. అందుకు భగవంతుడే ఏదో అవకాశం కల్పిస్తాడన్న ఆశ కూడా అతడికుంది. అతడి ఆశ తీర్చడానికే అన్నట్లు రెండేళ్లక్రితం భాగ్యవతీ నగరంలో యుద్ధవిద్యల పోటీలు జరిగాయి. ప్రతాపుడు అన్నిపోటీల్లోనూ పాల్గొనడమే కాదు, అన్నింటా ప్రథముడిగా నిలిచి అందర్నీ ఆకర్షించాడు. రాజు భాగ్యసేనుడు అతణ్ణి మెచ్చుకుని, ‘‘నీకేం కావాలో కోరుకో. ఇస్తాను’’ అన్నాడు.