ఒకానొక గ్రామంలో హరిశర్మ అనే పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన భార్య యశోద. ఆ దంపతులకు ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు. హరిశర్మ శివభక్తుడు. ఎల్లకాలం శివధ్యానంలోనే మునిగి తేలుతూ భార్యాబిడ్డల్ని పట్టించుకునేవాడు కాదు. నోటి మంచితనంతోనూ, ఊరివాళ్ల దయాదాక్షిణ్యాల మీదా ఎలాగో సంసారాన్ని నెట్టుకొస్తోంది యశోద.

హరిశర్మ కూతుళ్లు ఇద్దరూ అందమైనవాళ్లు. పొరుగూళ్లో ఉండే ఇద్దరు అన్నదమ్ములు ఏదో పనిమీద ఆ ఊరొచ్చి ఆ యువతుల్ని చూసి ఇష్టపడి పెళ్ళి చేసుకున్నారు. హరిశర్మ నిమిత్తమాత్రుడిలాగా వారికి కన్యాదానం మాత్రమే చేశాడు. కాపురానికివెళ్లిన ఆ ఇద్దరు కూతుళ్ళూ, తమ తండ్రి గురించి భర్తలకు చెప్పుకుని -నెల నెలా గ్రాసం నిమిత్తం తల్లికి కొంత ధన సహాయం అందే ఏర్పాటు చేశారు. హరిశర్మ కొడుకు శివశర్మ కూడా తండ్రి అడుగుజాడల్లోనే నడుస్తున్నాడు. అతడికి పదేళ్లు వచ్చినా అక్షరజ్ఞానం కలుగలేదు. కొడుకు భవిష్యత్తు గురించి యశోద ఎంతో వ్యథ చెందేది.

హరిశర్మ ఆమెతో, ‘‘నా కూతుళ్లకు వెతుక్కుంటూ సంబంధాలు వచ్చాయి. శివశర్మ గురించి నువ్వు ఏ దిగులూ పెట్టుకోవద్దు. అన్నింటికీ ఆ శివుడే ఉన్నాడు. శివభక్తి వాడిని కాపాడుతుంది’’ అని ధైర్యం చెప్పాడు.‘‘మన సాటివారిని చూడండి. అందరూ ఉన్న ఆస్తిని పదింతలు చేసుకున్నారు. పదిమందిలో గౌరవం సంపాదించుకుని గొప్పగా ఉన్నారు. మనమేమో ఉన్నదంతా పాడుచేసుకుని, ఇతరులపై ఆధారపడి హీనంగా బ్రతుకుతున్నాం. భక్తికైనా ఒక హద్దు ఉంటుంది. స్వయంకృషి ‍‍లేనిదే భగవంతుడు కూడా మనిషికి సహాయపడలేడు’’ అని వాపోయింది యశోద.