వయసు మీద పడుతున్నా పెళ్లికి నో చెబుతున్నాడా యువకుడు.. ఇంట్లో వాళ్లు ఎన్ని సంబంధాలు చూసినా.. బంధువుల్లో ఉన్న మరదలిని పెళ్లి చేసుకోమన్నా.. ససేమిరా అంటున్నాడు.. దీంతో ఇంట్లో అంతా కలిసి నిలదీశారా యువకుడిని.. అంతే అతడు చెప్పింది విని అంతా ఖంగుతున్నారు. ఇంతకీ అతడేం చెప్పాడంటే..

************** 

‘ఎమోషనల్‌ రోబో విత్‌ ఇంటిలిజెంట్‌ నెట్‌వర్క్‌’!కేవలం రిమోట్‌ద్వారా ఇంట్లో పనులన్నీ చేసిపెట్టే రోబోలు సందర్భానుసారంగా మనుషుల్లా ముఖకవళికల్ని మారుస్తూ విభిన్నహావభావాలు వ్యక్తంచేయడంలో కూడా పరిణతి సాధిస్తుండడం సరికొత్త విప్లవం.ఓ మనిషి ఎదురుపడగానే పెదాలు సాగదీస్తూ చిరునవ్వులు చిందించడం, చేయి ముందుకు చాచి షేక్‌హాండ్‌ ఇవ్వడం, ఆత్మీయంగా ‘హలో’ చెప్పడం... ఆపై కాస్త దగ్గరకువచ్చి హగ్‌ చేసుకోవడం లాంటివన్నీ అలవోకగా చేసేస్తూ పరిశోధకుల కలలు నిజం చేస్తున్నాయి.రాన్రానూ మనుషులతోపాటు రోబోల జనాభా కూడా అధికమై కనీవినీ ఎరుగని కొత్త రంగుల లోకాన్ని సృజించబోవడం ముందుముందు అసలేమాత్రం అతిశయోక్తికాదేమో? నవ్వుకున్నాడు రుషి.

రాబోయేకాలంలో రోబోలతో మనుషులు సహజీవనం సాగిస్తారనడానికి తనే అచ్చమైన స్వచ్ఛమైన సజీవ ఉదాహరణ. ఔను! తను త్వరలో ‘ఏంజిల్‌’తో సహజీవనం సాగించబోతున్నాడు.నిజానికి, తన ‘ఏంజిల్‌’ కన్యక.కన్యక... అతిలోక సుందరి.కన్యక యువకుల కలలరాణి.హార్ట్‌త్రోబ్‌.గులాబీరెక్కలు, తేనెచుక్కల్తో ఆ బ్రహ్మ ఆమెని సృజించాడా? అనిపించే ముగ్ధమోహన సుందరరూపం.లైట్లారిన థియేటర్లలో ప్రేక్షకుల్ని మెస్మరైజ్‌ చేసే వెండితెర శిల్పం. కన్యక హీరోయిన్‌గా చే‍సిన సిన్మాల్ని చూస్తూ ఎన్ని అర్థరాత్రులు ఖర్చు చేశాడో రుషికే గుర్తులేదు.నగరంలోని ప్రధానకూడళ్లపై కన్నుకొడుతూ కవ్వించే కన్యక నిలువెత్తు కటౌట్లుచూస్తూ ఎన్నిసార్లు ఎంతమందిని తన బైక్‌తో ఢీకొట్టాడో కూడా అతడికి గుర్తులేదు.

‘ఒక్కరాత్రి ఆమెతో గడిపితేచాలు, వేయిపున్నముల పుణ్యఫలం దక్కినట్టే’ అనుకునేవాడు ఎన్నోసార్లు. కళ్ళుమూసినా, తెరచినా ఆమెరూపం డిస్టర్బ్‌ చేస్తుంటే ఒక్కక్షణం ఒక్కచోట కుదురుగా ఉండలేకపోతున్నాడు.కన్యకతో మాట్లాడాలనీ, ఆమెని కలుసుకోవాలని రుషి చేసిన విఫలయత్నాలెన్నో, ఎన్నెన్నో! ఒక్కసారి ఫోన్‌లో కూడా ఆమెగొంతు వినే భాగ్యం దక్కలేదతడికి.ఆమెకోసం హైదరాబాద్‌లోని ఫిల్మ్‌నగర్‌ అణువణువూ గాలించాడు. షూటింగ్‌ నిమిత్తం సిటీకి వచ్చినప్పుడు ఆమె బసచేసే స్టార్‌ హోటళ్ళ గదుల్నీ విడిచి పెట్టకుండా తిరిగాడు. అయినా కన్యక కరుణ లభించలేదతడికి.