తెల్లవారింది...లేవడానికి అసలేమాత్రమూ ఓపిక లేదు. కానీ తప్పదు. లేవాలి. దాని కోసమన్నా లేవాలి. దానిని బాధ పెట్టకుండా వుండడం కోసమన్నా లేచి రోజూలాగే నా కార్యక్రమాలు మొదలు పెట్టాలి. రోజూలాగే సూర్యోదయానికి ముందే స్నానం పూర్తిచేసి పూజ చేసుకోవాలి. పాపం పిచ్చిది. నా మనసు చదివినట్లే ప్రవర్తిస్తుంది. తెల్లవారే సరికల్లా నా పూజ కోసం పూలు సిద్ధం చేస్తుంది ... రోజూ ... క్రమం తప్పకుండా.

ఇన్నాళ్ళలో ... ఈ సంవత్సర కాలంలో ఏరోజూ నన్ను నిరాశ పరచలేదు. అవును అది ఈ ఇంటికి వచ్చి సరిగ్గా సంవత్సరం. ఈ సంవత్సరమంతా ఎలా జరిగిందో తెలియనంత వేగంగా జరిగిపోయింది. ఎందుకూ పనికి రాని జీవచ్చవంలా భ్రష్టుడిలా బతుకుతున్న నా జీవితంలోకి మళ్ళీ వసంతాన్ని తెచ్చింది అది! నన్ను మళ్ళీ మనిషిని చేసింది! నేను మాత్రం ... నేను మాత్రం దానిని నిర్లక్ష్యం చేసినదెపుడు? నేను కూడా దానిని ప్రేమగానే చూసుకుంటున్నాను. నాకు చేతనయినంతలో దాని కోసం చేయాల్సినవన్నీ చేస్తూనే వున్నాను.రోజు మొత్తంలో నేను ఇష్టంగా ఆసక్తిగా చేసుకునే ఒకే ఒక్క కార్యక్రమం శివపూజ. అందుకు కావలసిన సహకారాన్నీ ఉత్సాహాన్నీ కూడా ఇస్తున్నది అదే. దానికీ బహుశా అదొక్కటేనేమో యిష్టమైన పని! భగవంతుడికి సేవ చేసుకోవడం తప్ప దానికి కూడా మరొక ధ్యేయమున్నట్లు కనబడదు! కానీ పాపం దానంతట అది యే పనీ పూర్తిచేసుకోలేదు.

అటూ యిటూ పరుగులు పెట్టి పనులు చక్కబెట్టుకోగల సమర్ధురాలు కాదది. ఆశ ఉన్నా అందుకు తగిన శక్తి లేని అభాగ్యురాలు. దానికీ నా సహాయం కావలసినదే. ఇలా ఇద్దరమూ ఒకరికొకరంగా కలిసి ఉన్నాము ఈ ఇంట్లో.ఒక్కొక్కసారి అనిపిస్తుంది, ఈ వృద్ధాప్యంలో.. ఈ ఓపిక లేని స్థితిలో నాకు ఈ ప్రేమలు, పాశాలు అవసరమా అని! మోహాన్నీ, మమకారాన్నీ జయించాల్సిన వయసులో లేని పోని బంధాన్ని మళ్ళీ ఏర్పర్చుకున్నానా అని!కానీ ఏమిటో అలా జరిగిపోయింది.ఆరోజు ... ఏమీ తోచక పిచ్చెక్కినట్లుగా వుంటే మూర్తిగారి ఇంటి వైపు వెళ్ళాను. వాకిట్లో కుర్చీలు వేసుకుని కూర్చుని మాట్లాడుకుంటున్నాం. అప్పుడు ... అప్పుడే యథాలాపంగా వాళ్ళ పక్కింట్లోకి చూసిన నేను చూపు తిప్పుకోలేకపోయాను.