చేతులకూ, నోటికీ, ముక్కుకూ రకరకాల రంగుగొట్టాలు వేలాడుతున్న సన్నటి పొడవాటి బక్కచిక్కిన శరీరాన్ని సావిత్రిగా గుర్తించడం చాలా కష్టమయిందామెకు. పూలూముళ్ళతో బాటూ విరిగి, వాడి, యెండిన చెట్టు కొమ్మలాగుందామె. దిగులుగా నిట్టూరుస్తూ వార్డు గదిలోంచి బయటి కొస్తూండగా ‘‘మేడం మీకేవవుతారు?’’ అని అడిగింది నర్సు.

‘‘కజిను... మా పిన్ని కూతురు’’ అంటూ వో అబద్ధాన్ని చకచకా చెప్పేశాక, ‘‘యెన్నాళ్ల నుంచీ యిలా?’’ అడిగిందామె.‘‘నాలుగు నెలలుదాటాయి. మీరే మొదటి విజిటరు’’ అంది నర్సు.‘‘అదేమిటి? కొడుకూ, కూతురూ రాలేదా?’’ విస్తుపోయింది.నర్సు ఫైలు తిప్పుతూ ‘‘వాళ్ళనుగూడా విజిటర్సుకిందే చేర్చాలి లెండి. మొదట్లో రెండుమూడు సార్లొచ్చిపోయారు’’ అంది.హాస్పిటల్లోంచి బయటికొచ్చి ఆటో యెక్కిందామె. యిలా యీ వూర్లో బాహాటంగా తిరగడం సాధ్యంగాని పాతరోజులు గుర్తు కొచ్చాయామెకు. యెప్పుడు తలదాచుకోవాలన్నా సందేహించకుండా, యీ వూరొచ్చి, సావిత్రి యింటిని చేరుకోవడం జ్ఞాపకమొచ్చింది. యిన్నేళ్ళ తర్వాత, యిన్ని మార్పుల తర్వాత కూడా ఆశ్రయాన్ని వెతుక్కుంటూ మళ్లీ సావిత్రి దగ్గరికే వచ్చింది. కానీ యిప్పుడామె హాస్పిటల్లో...సావిత్రి అద్దెయింట్లో వున్నప్పుడు కూడా యీ వూరొచ్చింది.

అప్పుడు చాలాసార్లు చాలారోజుల పాటూ ఉండిపోయింది. ఆమె స్వంత యిల్లు కట్టుకున్న తర్వాత మాత్రం వో సారి హడావుడిగా వెళ్ళిపోవలసి వచ్చింది. గోదావరి జిల్లాల్లో ఆఫీసర్ల కిడ్నాపులూ, యిక్కడ దగ్గర్లో లాండ్‌మైన్‌ పేలుడుతో జీపొకటి ధ్వంసంగావడం, పోలీసుల గాలింపులు పెరగడం - అప్పుడు గూడా సావిత్రి మాటవరసకైనా వెళ్ళిపోమనలేదు. పర్వాలేదని వారిస్తున్నా తానే వెళ్ళిపోయింది.ఆటో యింటి ముందు ఆగింది.

వరండా యినపగ్రిల్‌ తలుపులకల్లిన చిక్కటి యినప ‘మెష్‌’లోంచి లోపల చీకటి మాత్రమే కనిపిస్తోంది. బాగా మాసిపోయిన కాలింగ్‌బెల్‌ను నొక్కిందామె.రెండుసార్లు బెల్‌ నొక్కిన తర్వాత తలుపులు తెరుచుకున్నాయి. చీమిడి కారుస్తున్న చంటి పిల్ల నెత్తుకున్న యువతి విసుగ్గా చూస్తోంది.‘‘నేను అనసూయ... సావిత్రి నా కజిను’’ అని పరిచయం చేసుకుందామె. ఆ యువతి అయితే యేమిటన్నట్టుగా చూస్తోంది.అనసూయ చొరవగా ముందుకో అడుగేసి ‘‘అనిల్‌ లేడా?’’ అని అడిగింది.‘‘లేడు. ఆఫీసు.. అట్నే హరేరామ హరేకృష్ణ గుడికెళ్ళి...’’