జమ్మూ కాశ్మీర్‌... ఫూంచ్‌ జిల్లాశత్రువు మన భూభాగంలో ల్యాండ్‌మైన్లు అమర్చాడని సైన్యానికి ఇంటిలిజెన్స్‌ నివేదిక అందింది. అదెంతవరకూ నిజమో నిర్ధారణ చేసుకోవాలని కల్నల్‌ గురుప్రీత్‌సింగ్‌ భావించాడు. దానికోసం ఒక బృందాన్ని ఏర్పాటు చేశాడు. సైన్యం నుంచి ముగ్గుర్ని, సరిహద్దు భద్రతాదళాల నుంచి ఇద్దర్ని ఎంపికచేసి ఒక సంయుక్తబృందంగా ఏర్పాటుచేశాడు. ఆ బృందంలో సైన్యంనుంచి తీసుకున్న ముగ్గురిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సమర్‌ కూడా ఉన్నాడు. వాస్తవాధీనరేఖకు దగ్గర్లో ల్యాండ్‌మైన్లు అమర్చారని అనుమానిస్తున్నచోట జాగ్రత్తగా కదులుతున్నాడు సమర్‌.

భార్య కళ్యాణి గురించిన ఆలోచనలు అతని మనసుని జాజిపరిమళంలా పలకరిస్తున్నాయి. సైన్యంలో పనిచేస్తున్న సమర్‌ని పెళ్ళిచేసుకోవడానికి చాలామంది ఆడపిల్లలు విముఖత చూపించారు. కళ్యాణి మాత్రం ఇష్టపడింది. సైన్యంలో చేస్తున్నాడన్న ఒక గౌరవభావంతో వివాహమాడింది. సమర్‌కి భార్య అంటే ఎనలేని ప్రేమ. కళ్యాణి సన్నిధిలో గడిపిన ప్రతిక్షణమూ అతడికి ఓ స్వప్నం. విధినిర్వహణలో ఉన్నా, ఆమె జ్ఞాపకం అతన్ని, అంతలా కలవరపెట్టడానికి ఓ కారణం ఉంది.తారీఖు ప్రకారం, కళ్యాణికి ప్రసవం జరిగేది ఈ రోజే!!తండ్రి కాబోతున్నానన్న ఉద్విగ్నత సమర్‌ గుండెగదులన్నిటా ఆవరించుకుంది.నిజానికి ప్రసవ సమయంలో ఈ రోజు భార్యచెంత ఉండాలని సెలవుకోసం ప్రయత్నించాడు. కానీ ఫూంచ్‌జిల్లాలో ఉద్రిక్తపరిస్థితులున్నాయి.

పొరుగుదేశపు అండదండలతో ఉగ్రమూకలు భారత శిబిరాలపై దాడులకు తెగబడుతున్నాయి.ఉగ్రమూకలు భారత జవాన్లపైన డెత్‌ట్రాప్స్‌ విసురుతున్నాయని ఇంటెలిజెన్స్‌ నివేదికలు! అందుకే పై అధికారులు సమర్‌కి సెలవు మంజూరు చెయ్యలేదు. భార్య నిండుగర్భిణి. ఆ ఛాయా చిత్రాన్ని తన ఫోన్లో భద్రపరుచుకున్నాడు సమర్‌. తన బిడ్డని మోస్తూ ఎత్తుగా మారిన భార్య కడుపుని చూస్తే ఏదో మధురమైన భావన. వారంక్రితం ఫోన్‌చేసి మాట్లాడిన భార్య మాటలు గుర్తొచ్చాయి.‘‘డాక్టర్‌ చెప్పిన తేదీ దగ్గరపడుతోంది. మీకు సెలవు మంజూరైందా? మన బాబుని చూడాలని లేదా మీకు? నాకైతే ప్రసవసమయంలో మీరు నా పక్కనే ఉంటే బాగుండు ననిపిస్తోంది. మీరు నా చెంత ఉంటే ఎంత ప్రసవవేదననైనా చిరునవ్వుతో భరించగలను’’.

కాశ్మీర్‌ లోయలోని ఉదయపు చలి, సమర్‌ మిలిటరీ దుస్తుల్ని చీల్చుకునిమరీ అతడి శరీరాన్ని వణికిస్తోంది. భార్యస్మృతులతో అతని యదలోయలో కన్నీటి తడి. ‘‘ఏవండీ! నా కెందుకో మనకు బాబే పుడతాడనిపిస్తోంది. మీ రూపంలో బాబే పుట్టాలి నాకు. నేను మిమ్మల్ని కోరిచేసుకున్న మాట నిజమే, కానీ కానీ మనబాబుని మాత్రం సైన్యంలోకి వెళ్ళనీయను. అంతే. అది ఇక్కడితో మీతోనే ఆగిపోవాలి’’