ఇవి చిన్ననాటి ముచ్చట్లు. హేమంతం జరుగుతుండగా ఒకానొకనాటి వుదయం నిద్రలేచి కళ్ళు నులుముకుంటూ యింటి ముంగిలికి వచ్చేసరికి గడప ముందర వీధిలో రంగవల్లికల్లో పేడముద్దల పైన గుమ్మడిపువ్వులు కనిపించేవి. అవి కనబడగానే పండుగ నెల ప్రారంభమైందను కునేవాళ్ళం. ఆ రోజు సాయంత్రానికల్లా మావాడ పడుచులు వాల్జడల్లో చేమంతులు నవ్వుతుండగా గొబ్బెమ్మను తట్టలో తంగేడుపువ్వుల్లో కూచోబెట్టి గ్రామసంచారానికి బయల్దేరేవారు.

మగపుటక పుట్టి, సంకురాత్రి సంబరాన్నంతా దోచుకునేందుకలా బయల్దేరే ఆడపిల్లల్ని జూస్తూ వూరుకోలేక వాళ్ళవెంట మేమూ బరాబరులు తిగరేవాళ్ళం. మేము గడుగ్గాయి కుర్రాళ్లమనీ, నోరూవాయీ లేని ఆడబిడ్డల్ని ఏడిపించుక తింటామని ఊళ్ళో ఒక ఆపప్రథ వుండేది. ఇలా మనుమరాండ్రని వెనకేసుకొచ్చే తాతయ్యలని చూచి మేము ఏ మాత్రం భయపడేవాళ్ళం కాము. ఆ మాటకొస్తే ‘‘చేస్తేచేస్తారు. పండుగలొచ్చేదెందుకు? పిల్లలు అల్లరి చేయడానికి కాకపోతే’’ అని అంగరక్షకుల్లా నిలబడ్డానికి మాకూ కొందరు హేమాహేమీలు లేకపోలేదు. అలా మమ్మల్ని వెనకేసుకొచ్చే వాళ్ళందరూ మా నాయనమ్మలేనని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదనుకుంటాను. మగవాళ్లు ఆడవాళ్ళపైన, ఆడవాళ్ళు మగవాళ్ళ పైన అభిమానం ఒలికించడం ప్రకృతి సహజమని నాకప్పుడు తెలియదు.హేమంతం అందమైన ఋతువే కావచ్చు. కానీ గులాబీకి ముళ్ళుంటాయి.

హేమంతంలో చలి జనాన్ని వేపుక తింటుంది. అందులోనూ మాది కొండకోనల మధ్య బిక్కు బిక్కు మంటుండే పల్లెటూరు కావడం చేత, ఎముకల్ని కొరికివేసే చలితాలూకు భయానక స్వరూపం మాకయినట్టు మరొకరికి అర్థం కాదు. పట్టణాలకి వెళ్ళినప్పుడు, మా వూరు ప్రకృతిమాత ఒడిలో గారాలుబిడ్డ అని మేము సగర్వంగా చెప్పుకునే మాట నిజమే! ఐతేనేం! అలా చెప్పడం చేత మావూళ్ళో చలిబాధ లేదన్న భావం సూచించబడదు గదా!ఆ రోజుల్లోనేమి, ఈ రోజుల్లోనేమి చలిబాధ ఎదుర్కోడానికి రెండంటే రెండు పద్ధతులు మాత్రం వున్నాయి. మావూరు పల్లెటూరని ముందే చెప్పాను. ఉన్న నలభై యిళ్ళలో కలిగినవాళ్ళని నాలుగైదు పెంకుటిళ్ళు తప్పితే, మిగిలినవన్నీ పూరిళ్ళు, తాటాకుపాకలు. కలిగినవాళ్ళకు పెంకుటిళ్లు ఎలాగైతే వున్నాయో, అలాగే దుప్పట్లు, శాలువలు కూడా వుంటాయి. వాటిలో ఒళ్ళు ముడుచుకొని ఇనప్పెట్టెల్లాంటి గదుల్లో నిద్రపోవడానికి హేమంతంలో వాళ్ళు అలవాటు పడిపోతారు. కానీ పాకల్లో వున్నవాళ్ళ గతి? వాళ్ళు అర్ధరాత్రినుంచీ పొద్దు కరకర పొడిచేవరకూ, చలిమంటల చుట్టూ కూచుంటారు. చలికాలం రాబోతుందనగా, పెంకుటిళ్ళవాళ్ళకు కాన్పూరు శాలువలు, నారాయణవనం దుప్పట్లు అవసరమైతే పాకల్లో వాళ్ళకి కందికంపలు అవసరమయ్యేవి.