సంతోష పెట్టే కళరచనః వసుంధరవీరయ్యకు అయిదుగురు కొడుకులు. పెద్దవాడు వెంకయ్య చిత్రకారుడు. రెండవవాడు రంగయ్య శిల్పి. మూడోవాడు చంద్రయ్య కవి. నాలుగోవాడు సూరయ్య గాయకుడు. అయిదోవాడు నారయ్యకు మాత్రం ఏ విద్యలూ రావు. తండ్రి వాడి గురించే బెంగపడేవాడు.ఆ ఊరిపెద్ద ఒకసారి వీరయ్య కొడుకుల ప్రతిభను చూసి అచ్చెరువొందాడు. ఆయన వాళ్లతో, 'మీ విద్యకు తగిన పేరు ప్రతిష్ఠలు రావాలంటే మీరు రాజధానికి వెళ్లి రాజును ఆశ్రయించండి' అన్నాడు. పెద్దవాళ్లు నలుగురికీ ఆ మాటలో నిజం ఉందనిపించింది. వాళ్లు రాజధానికి ప్రయాణం అయ్యారు. అప్పుడు నారయ్య కూడా అన్నలతో పాటు తనూ ప్రయాణమయ్యాడు.వాడెందుకూ పనికిరాడు సరికదా అన్నలకు కూడా భారమౌతాడని తండ్రి అనుకున్నాడు. 'వాళ్లతో నువ్వెందుకురా? నా దగ్గరుండి పనుల్లో నాకు చేదోడువాదోడుగా ఉండు' అని వారించాడు వీరయ్య. నారయ్య ఒప్పుకోలేదు. 'నాకు మన దేశపు రాజును చూడాలనుంది. వెళ్లి ఆయన్ను చూస్తాను. అక్కడ కొన్నాళ్లుండి వెనక్కి వచ్చేస్తాను' అన్నాడు. వాడు పట్ట వదలడని రూఢి అయ్యాక, 'అయితే ఉన్నన్నాళ్లూ అన్నలను మంచి చేసుకొని వాళ్ల అభిమానం సంపాదించుకో' అని నారయ్యకు సలహా ఇచ్చాడాయన.అన్నలకు నారయ్యను తమ కూడా తీసుకొని వెళ్లడం ఇష్టం లేదు. వాళ్లు గింజుకుంటుంటే, 'మీరేం చెబితే అది చేస్తాను. మీ ఈ చిట్టితమ్ముడిమీద జాలి చూపండి. నా కోరిక తీర్చండి' అని నారయ్య వాళ్లను అదేపనిగా బ్రతిమాలాడు. చివరికి అన్నలు వాణ్ణి తమతో తీసుకెళ్లడానికి ఒప్పుకున్నారు.రాజధాని వాళ్ల ఊరికి బాగా దూరం. మజిలీలు వేసుకుంటూ వెడితే నెలరోజులు పడుతుంది. ఆ నెల రోజులూ అన్నలతో ప్రయాణం చేస్తూ నారయ్య చాలా శ్రమ పడవలసి వచ్చింది. అన్నలు వాణ్ణి చీటికీమాటికీ చీదరించుకునేవారు. వాడికి కష్టమైన పనులు అప్పజెప్పేవారు. నారయ్య మాత్రం ఎప్పుడూ ఎక్కడా విసుక్కోలేదు. పైగా తరచుగా అన్నల ప్రతిభను పొగుడుతూండేవాడు. 'మీరు నా అన్నలు కావడం నా అదృష్టం. మీకు సేవలు చేయటం నాకు మహాభాగ్యం' అని ప్రతిరోజూ తమని పొగుడుతుంటే అన్నలకు కూడా క్రమంగా వాడిపై అభిమానం పుట్టింది.