సరస్వతీ పుత్రుడతను. అర్థాంతరంగా తండ్రి కన్నుమూస్తే ఆ సరస్వతే అతడికి చదువుచెప్పించి తీర్చిదిద్దింది. తండ్రి కల నెరవేర్చమని ప్రోత్సహించింది. అలా పిహెచ్‌డి పట్టాకోసం విశ్వవిద్యాలయస్థాయి విద్యార్థిగా ఎదిగాడు. కానీ చదువులతల్లి కొలువుండే ఆ పవిత్రప్రాంగణం కలుషితం కావడం అతడు జీర్ణించుకోలేకపోయాడు. ఎంతగా తలవంచుకుని చదువులో లీనమైనా ఆ చైతన్యం గొంతు విప్పకతప్పలేదు!! కానీ....

పాతికేళ్ళు ఉత్కృష్ట శరీరంలో బందీ అయిన ఆత్మ..ఆత్మహత్యపాలైన బొందినుండి విముక్తిపొందింది. కొత్తశరీరంలో ప్రవేశించడానికి భూలోకంలో ఏ మూలచూసినా క్యూలు బార్లుతీరి ఉన్నాయి. జననాల రేటుతో మరణాల రేటూ పెరిగిపోతోంది కదా!స్వేచ్ఛపొందిన ఆత్మ అంతరిక్షంలో సంచరిస్తోంది. శరీరం కాలి బూడిదైనా బంధనాలు తెంచుకోని ఆత్మ ఇంకో శరీరంలో ప్రవేశించే వరకూ గతపు వాసనలు చావవల్లే ఉంది.అమ్మ మాతృత్వపు వాసన కమ్మగా వీస్తుంటే ఇంటివైపు చూసి లోపలికి ప్రవేశించాను. నేను ఆత్మహత్య చేసుకుని ఇంకా నాల్గురోజులు కూడా కాలేదు. అందుకే అమ్మని గుర్తుపట్టగలుగుతున్నాను.అమ్మను చూసిన ఆనందంలో ఎప్పట్లాగే ‘‘అమ్మా!’’ అని పిలిచాను. ఎంతసేపు పిలిచినా బదుల్లేదు. నా పిలుపు గొంతులో ఆగిపోయిన నిశ్శబ్ద ఆక్రందనలా ఉంది.

కొడుకు పోయాడన్న గర్భశోకంతో ఏడ్చిఏడ్చి అలసిపోయి నిద్రపోతోంది పిచ్చితల్లి!పోయిన నెలలో అర్థరాత్రి ఇంటి కొచ్చినప్పుడు, నా పిలుపు వినగానే దిగ్గునలేచి, వెంటనే వేడివేడిగా అన్నం వండి, నీళ్ళచారులోనే కమ్మనైన అమ్మప్రేమ రంగరించి, కొసరి కొసరి తినిపించావే. కష్టాలన్నీ నువ్వే భరించి నన్ను ఎత్తుల్లో చూడాలని కలలుగని అనుక్షణం ‘‘నేనున్నా’’ అంటూ చదివించిన నీకు....ఆ ఆనందాన్ని అందించకుండానే ఆత్మహత్య చేసుకున్నాను, నన్ను మన్నించమ్మా!’’ ఒక్కసారి కళ్ళు తెరచి చూడమ్మా! చూపుల్ని కన్నీటిచెమ్మతో కడుక్కున్నా, మనసంతా క్రుమ్మరించి శోకిస్తున్నా నీకు వినపడటం లేదా? అమ్మా! పాతికేళ్ళనుండి పెనవేసుకున్న మమతల బంధపు ఆనవాళ్ళు అగుపించటం లేదా? అవున్లే ఎందుకు వినిపించాలి? కనిపించాలి? మన అనుబంధం తెగిపోయి నాలుగురోజులైందికదా!‘‘ఆత్మబంధాలు తెంపుకోవడానికింత బాధపడాలా?’’తంతుముగిసిన ఇంట్లో, నా ఫొటో ముందు కాలికాలి ఆరిపోయిన ఊదుబత్తికి వేలాడుతున్న కాలిన బూడిదలా నా ఆత్మ అమ్మ చూపుకోసం ఎదురుచూస్తోంది.