పూర్వం చండీపురంలో గానయ్య అనే ఒక సంగీతవిద్వాంసుడు ఉండేవాడు. అతడు తనకు వచ్చిన విద్యను పదిమందికీ నేర్పుతూ పొట్ట పోషించుకొనేవాడు. అతడి శిష్యులందరిలోకి చంద్రయ్య అనేవాడు చురుకైనవాడు.వాణీపురం నగరానికి చెందిన చంద్రయ్యకు అయినవాళ్లెవ్వరూ లేరు. అతడికి సంగీతం నేర్చుకోవాలని మహా కోరిక. అలా గానయ్యవద్ద శిష్యుడిగా చేరాడు. శ్రద్ధగా ఏకాగ్రతతో సాధనచేసి త్వరలోనే గానయ్య శిష్యులనందర్నీ మించిపోయాడు. ఏడాది గడిచేసరికి గానయ్య అతడితో, ‘‘నీ విద్యాభ్యాసం పూర్తయింది. ఇక నీవు సభల్లో పాడవచ్చు. పదిమందికి విద్య నేర్పవచ్చు’’ అన్నాడు.

 చంద్రయ్య సంతోషించలేదు. ‘‘గురువర్యా, సంగీతం మహాసాగరమైతే, నేను నేర్చినది నీటిబొట్టంత. మీ దగ్గరే ఉండి, మిమ్మల్ని సేవించుకుంటూ, మరిన్ని సంగీత రహస్యాలు తెలుసుకుంటాను’’ అన్నాడు.గానయ్య కాసేపు ఆలోచించి, ‘‘ప్రపంచంలో సుఖంగా బ్రతకడానికీ, పదిమందిని మెప్పించడానికీ ఇంతవరకూ నువ్వు నేర్చిన విద్య చాలు. ఇంకా నేర్చుకోవడంవల్ల ఆత్మతృప్తితప్ప వేరే ప్రయోజనం ఉండదు. అదీకాక నీవు ఇప్పటికంటే చాలా ఎక్కువ కృషి చేయవలసి ఉంటుంది. అందుకు సిద్ధమేనా!’’ అన్నాడు. చంద్రయ్య మారు ఆలోచన లేకుండా సరేనన్నాడు.‘‘అయితే ఒక ఏడాదిపాటు నీవు రోజూ కొన్ని కఠోర నియమాలు పాటించాలి.

తెల్లవారు ఝామునే లేచి చన్నీళ్లతో స్నానం చెయ్యాలి. తరువాత మూడుగడియల పాటు సరస్వతిని ఉపాసించాలి. పదిమంది విద్యార్థులకు ఉచితంగా సంగీతం నేర్పాలి. వారికి ఒకపూట కడుపునిండా తిండి పెట్టాలి. నీవు కూడా వారితోపాటే భోజనం చేయాలి. ప్రతిరాత్రీ ఉపవాసం ఉండాలి. అలా ఏడాది గడిచేసరికి వెయ్యి బంగారు నాణేలు కూడబెట్టి తెచ్చి నాకివ్వాలి. ఆ డబ్బు స్వయంకృషితో సంపాదించాలి. దానంగా పొందకూడదు. డబ్బుకోసం సంగీతాన్ని వాడకూడదు’ అన్నాడు గానయ్య.