కాంపిల్యనగరాన్ని దండధారుడు పాలిస్తున్న రోజులవి. ఆ రోజుల్లో మగపిల్లలు మాత్రమే చదువుకునేందుకు గురుకులాల్లో ప్రవేశించేవారు. ఆడపిల్లలకు చదువుకునే అవకాశం లేదు. వారికి గురుకులాలు నిషిద్ధం. అయితే దండధారుని కూతురు హలకి చదువంటే చాలా ఇష్టం. మగపిల్లల్లాగే తానూ చదువుతానని ఇంట్లో పోరు పెట్టిందామె. నేనెందుకు చదువుకోకూడదు? నన్నెందుకు గురుకులానికి పంపరంటూ కనిపించిన పెద్దల్నీ, మంత్రి సామంతుల్నీ ప్రశ్నించసాగింది. కూడదమ్మా! తప్పు అని దండధారుడు ఎంత చెప్పినా వినలేదు. ఎన్ని కానుకలిచ్చినా తీసుకోలేదు. హలను గురుకులానికి పంపి చదివించాల్సిందే! తప్పదు! లేకపోతే ఈ అల్లరీ, ఆవేశంతోఏ ఘాతుకానికైనా పాల్పడుతుంటుందని భయపడ్డారు. అయితే ఆడపిల్లగా పంపించలేరు.పంపకూడదు కూడా. అటువంటప్పుడు ఏం చెయ్యాలి? దుస్తులు మార్చి మగపిల్లాడుగాపంపడం మంచిదనుకున్నారు. ఆ మాటే చెప్పారు హలకి.‘‘నువ్వు ఆడపిల్లవని ఎట్టి పరిస్థితుల్లో తెలియకూడదు. గురుకులంలో ఎప్పుడూ నువ్వు మగపిల్లాడు దుస్తుల్లోనే ఉండాలి.’’ అన్నారు. అలాగేనన్నది హల. అనుకున్నట్టుగానే ఆమెకు మగ దుస్తులు వేసి, చదువుకునేందుకు గురుకులానికి పంపారు. తన పేరు నాభి అని, చదువే తన ధ్యేయం అంటూ ఎప్పుడు చూసినా చదువుకుంటూ కూర్చునేది హల.

‘‘నాభిగాడు చదువు పిచ్చోడురా! వాడికి పుస్తకాలు తప్ప మరో లోకం తెలీదు.’’ అనేవారు సాటి విద్యార్థులు. పట్టించుకునేవారు కాదు. నృగుడికి మాత్రం నాభితో స్నేహం ఏర్పడింది. నాభిలాగే నృగుడు కూడా బాగా చదువుకోవాలనే జిజ్ఞాసతో ఉండేవాడు. ఇద్దరూ కలిసి చదుకునేవారు. చర్చించుకునేవారు. ఒకరికి ఒకరు అప్పజెప్పుకునేవారు. ఇద్దరికీ స్నేహం బాగా కలిసింది. ఇద్దరిలో ఏ ఒక్కరు అధ్యయనానికి రాకపోయినా, అభ్యాసానికి రాకపోయినా మరొకరికి దిగులుగా ఉండేది. బాధగా ఉండేది. భయంగా ఉండేది. జంటగా కూర్చుంటే ఇద్దరికీ ఎక్కడలేని ధైర్యం ఉండేది. ఒకరికి ఒకరు సాయంగా ఉన్నారనిపించేది. ఒంట రిగా కూర్చుంటే అధైర్యంగా ఉండేది. విలవిల్లాడిపోయేవారు. ఒకరికి ఒకరు కావాలనిపించేది. ఒక రిని ఒకరు వదలి ఉండలేమనిపించేది. రోజులు గడుస్తున్నాయి.ఒకరోజు, రథాన్ని తీసుకుని గురుకులానికి సారథి వచ్చాడు. రాజు దండధారుడు వెనువెంటనే బయల్దేరి రమ్మన్నాడని హలకి చెప్పాడు.