నాంపల్లి రైల్వేస్టేషన్‌. రైలు కదిలిపోతుంటే, ఆ ఐదుగురూ కుమార్‌ ఉన్న కంపార్టుమెంట్‌లోకి సామాన్లతో హడావుడిగా ఎక్కారు. ఒక మధ్యవయస్కుడొచ్చి ‘‘ఇదిగో కన్నతల్లీ! ఈ రెండు బెర్తులూ మీవి. నీదీ, మీ నాన్నమ్మదీనూ’’ పాతికేళ్ళ యువతికి చెప్పాడు. ‘‘నాదీ, మీ అక్కదీ, మీనాన్నదీ పక్కన కంపార్టుమెంటులో ఉన్నాయి. మీకేం భయంలేదు, మేంవచ్చి చూచిపోతుంటాం’’ అంటూ రెండు ట్రంకుపెట్టెలు, నాలుగు బ్యాగులు బెర్తుకింద సర్దాడు. కుమార్‌వైపు చూసి ‘‘మేం వైజాగ్‌ వరకూ వెళ్ళాలి, మీరు వీళ్ళను కాస్త కనిపెట్టుకుని ఉండండేం? అవునూ. మీరెంతవరకు వెళ్ళాలి?’’ అడిగాడు మధ్యవయస్కుడు.

‘‘నేనూ వైజాగే వెళ్ళాలిలెండి’’ అన్నాడు కుమార్‌ యువతి తనవైపే చూస్తుంటే. ‘‘సరిసరి మేము వైజాగ్‌ వెళ్ళాలి. కాకపోతే అనకాపల్లిలో దిగిపోతాం. మీరున్నారు కాబట్టి, ఏ ఇబ్బందీ లేదు. భోజనాలవేళ వరకు మేం, అటూ ఇటూ తిరుగుతుంటాం. అన్నట్టు మీరు మాకో హెల్ప్‌ చేయగలరా! మా పెద్దావిడికి, మిడిల్‌ బెర్తిచ్చారు. కండక్టరు వస్తే ఈమెకు ఎక్కడైనా లోయర్‌ బెర్త్‌ ఇవ్వగలరేమో అడగగలరా? ఈమెకు ముణుకులనొప్పి. పెద్దవయసుకదా! నేనూ అడుగుతానులెండి’’.‘‘కండక్టరు వరకు ఎందుకు! నాది లోయర్‌ బెర్తే. నేను మిడిల్‌లోకివెళ్ళి ఆమెకు లోయర్‌ బెర్త్‌ ఇస్తానులెండి’’ హామీ ఇచ్చాడు కుమార్‌.‘‘థాంక్సండి థాంక్స్‌. ఇక సమస్య తీరినట్టే. మా కన్నతల్లిదీ మిడిలే లెండి. ఎదురుబెర్త్‌ లో సామానంతా తను చూసుకుంటుందిలెండి ఆమె మా మరదలే’’ అంటూ పక్క కంపార్టుమెంట్‌లోకి వేగంగా వెళ్ళిపోయాడు. కుమార్‌ ఆ కన్నతల్లివైపు చూశాడు.

నవ్వుతున్న కళ్ళతో ఆమె కుమార్‌వైపు చూసింది. ఆ మధ్యవయస్కుడు మళ్ళీ హడావుడిగా ఒక ముసలామెతో తిరిగి వచ్చాడు. అతని వెంటవచ్చిన అతని భార్య ‘‘నాన్నమ్మా! నువ్వీ బెర్త్‌మీద కూర్చోవచ్చు. పడుక్కోవచ్చు. నీకుతోడుగా కన్నతల్లి ఉంటుంది’’ అంటూ కుమార్‌ పక్కనేకూర్చున్న కన్నతల్లి పక్కనే కూర్చుంది. ఆమె అలా కూర్చోగానే కిటికీ దగ్గర లాప్‌టాప్‌ మీద పనిచేస్తున్న కుమార్‌ని, బలంగా కిటికీవైపు తోసినట్టయింది. పక్కకు తిరిగి చూశాడు. కన్నతల్లి అతనికి మరీదగ్గరై కుమార్‌ భుజాన్ని మొదట మెత్తగా, తరువాత గట్టిగా హత్తుకున్నట్టయింది. కన్నతల్లి వెంటనే తేరుకుని ‘‘సారీ రండి. మీకు అసౌకర్యం కలిగించాం. అక్కా, కాస్త పక్కకు జరగవే’’ అంటూ తాను కొద్దిగా జరిగింది.