ఆఫీస్‌కి టైం అయిపోతుందని హడావిడిగా బయటపడి తలుపుకి తాళం వేశాడు వినయ్‌. తాళం చెవి జేబులో పెడుతుంటే పక్క ఫ్లాట్‌ తలుపు తీస్తున్న శబ్దమైంది. వినయ్‌ ఉలిక్కిపడ్డాడు. పక్కఫ్లాట్‌లో ఉన్న జలగ.. కాదు.. కాదు.. జలజ తనని చూసేలోగా అర్జెంట్‌గా మాయమవ్వాలనుకుని లిప్టు్‌ వేపు విసురుగా నడిచాడు.సమస్య ఏమిటంటే జలజ చాలా స్వతంత్రంగా చనువు తీసుకుంటుంది. అది వినయ్‌కి నచ్చదు. జలజ తండ్రికి ఆరు నెలల క్రితం వేరే రాష్ట్రానికి ట్రాన్స్‌ఫరయ్యింది. అప్పటినుంచీ జలజ ఒంటరిగా ఉంటూ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తోంది. ఇక ఇప్పుడు ఆమె తీసుకునే చనువుకి హద్దూ పద్దూ లేకుండా పోయింది.

తప్పించుకోవాలని వినయ్‌ ఎంత వేగంగా కదిలినా ప్రయోజనం లేకపోయింది. అతను రెండో అడుగు వేయకుండానే జలజ కారిడార్‌లోకి రావటం ‘వినయ్‌! ఒక సాయం చేస్తావా?’ అని అడగటం జరిగిపోయాయి.వినయ్‌కి గుండె జారి మోకాలులో సెటిలయ్యింది. జలజతో సంభాషణ చేసేటప్పుడు అలా అవటం మామూలే కానీ ఇప్పుడు మాత్రం ఆ ప్రక్రియకి సరిపోయే విధంగా ఠంగుమంటూ బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ తోడయినట్లు తోచింది.‘వినయ్‌! ఫైవ్‌ హండ్రెడ్‌ ఇస్తావా? సాయంకాలం లోగా కట్టకపోతే ఇంటర్నెట్‌ కట్‌ చేస్తాడు’ అతని పక్కకి వచ్చి దీనంగా అడిగింది జలజ.కాదు.. లేదు.. వద్దు.. చేయను.. అన్నపదాలు సాధారణంగా వినయ్‌ నోటి నుంచి రావు.

సమయం సందర్భం లేకుండా చొచ్చుకుని వచ్చి మరీ విసిగిస్తుంది అని జలజపైన లోలోపల ఎంత కోపం ఉన్నా ‘అయ్యో! ఇంటర్నెట్‌ అందుబాటులో లేకపోతే ఇరవై ఒక్క ఏళ్ళు ఉన్న యువతికి చాలా ఇబ్బంది కదా అన్న భావనతో అతని చేయి పర్సు అందుకోవాలని అప్రయ త్నంగా జేబుని తట్టింది. చేతికి ఖాళీ జేబు తగిలింది. పర్సు ఇంట్లో ఉంచి మర్చిపోయాను ఇప్పుడెలా అన్న కంగారుని అదిమిపెట్టి ‘సారీ జలజా! నా పర్సు ఎక్కడో మిస్‌ ప్లేస్‌ అయ్యింది. నాకు ఇప్పటికే బాగా ఆలస్యం అయింది’ అని చెప్పి లిఫ్టు వంక పరుగు తీశాడు.