కాలింగ్‌ బెల్‌ శబ్దానికి చటుక్కున మెలకువ వచ్చింది. టైం చూశాను,. ఉదయం ఎనిమిదైంది.‘‘మైగాడ్‌!’’ అనుకుంటూ లేచి తలుపు తీశాను. ఎదురుగా రూం సర్వీస్‌ బోయ్‌.‘‘సార్‌...కాఫీ!’’ అంటూ ట్రేలో ఫ్లాస్క్‌, కప్‌తో నిల్చుని ఉన్నాడు. లోపలపెట్టాక అతడిని పంపించి, బద్ధకం వదిలించుకుంటూ బ్రష్‌ చేసుకుని, కాఫీ సిప్‌చేస్తూ న్యూస్‌పేపర్‌ చేతిలోకి తీసుకున్నాను.నిన్న సాయంత్రం జరిగిన సురభి సాహితీ సంస్థ వారి సభా వివరాలు, ఫొటోలు సిటీ ఎడిషన్‌లో ప్రచురితమైనాయి.

వేదిక మీద సన్మానం, ముఖ్యఅతిధుల ప్రసంగం, నిర్వాహకుల, వక్తల ప్రశంసలు...అనంతరం కొత్తగా పబ్లిష్‌ అయిన నా కథలు సంపుటి ‘చెలిమి–కలిమి’ ఆవిష్కరణ, ఆ తర్వాత నా ప్రసంగం, అన్నీ స్మృతిపథంలో మెదిలాయి.బెంగుళూర్లో ఉంటున్న నన్ను హైదరాబాద్‌లోని సురభి సాహితీ సంస్థ నిర్వాహకులు కలిసి సన్మానించాలనుకున్నట్లు అభ్యర్థించగానే కొంచెం ఆలోచనలో పడ్డాను.సాధారణంగా నాకు సన్మానాలూ, పొగడ్తలూ, ముఖస్తుతులూ ఇష్టం ఉండవు. మరీ బాగుండదని అనిపిస్తే తప్ప వీటికి సాధ్యమైనంతవరకూ దూరంగానే ఉంటాను.వీళ్లు అడగగానే తిరస్కరించకుండా ఆలోచనలోపడడానికి కారణం సన్మానవేదిక హైదరాబాద్‌ కావడం.

నా ప్రియనెచ్చెలి లలిత హైదరాబాద్‌లో ఉందని ఇటీవలే నాకు తెలియడం, వెదకబోయిన తీగ కాలికి తగిలిందనిపించింది.సురభి వారికి నా అంగీకారం తెలిపాను.లలిత నా బాల్యస్నేహితురాలు, నా హితైషి. ఒక విధంగా సాహిత్యరంగంలో ఇప్పటి నా పటిష్టమైనస్థితికి కారకురాలు.న్యూస్‌పేపర్‌ పక్కనపడేసి, ‘త్వరగా తెమిలి బయల్దేరాలి’ అనుకుంటూ లేవబోయిన నా దృష్టి ఎదురుగా టీపాయ్‌మీదున్న కథాసంపుటి ‘చెలిమి–కలిమి’ మీద నిలిచింది. ముచ్చటైన ముఖచిత్రంతో ఉన్న దాన్ని చేతిలోకి తీసుకున్నాను. పసిపాపను ఒడిలోకి తీసుకున్నప్పుడు మాతృమూర్తి పొందే అనుభూతిలాంటిది కలిగింది.