అన్ని షరతులకూ తలవొగ్గి అడిగినంత అడ్వాన్స్‌ ఇచ్చి హుటాహుటిన ఆ ఇంట్లో అద్దెకు దిగిపోయాడాపెద్దాయన. పనివాళ్ళనుపెట్టి తనుండేవైపు ఇంటిని అందంగా తీర్చిదిద్దాడు. ఇక అప్పుడు మొదలైంది యజమానురాలికి అసలు అవస్థ! తనే ఇంటి యజమానైనట్టు పెత్తనం మొదలెట్టాడు! ఆ ప్రహరీగోడ కట్టించొచ్చుగా? ఆ తలుపు గడియ బాగుచేయించుకోవచ్చుగా? అయ్యో నుయ్యి ఎండిపోయిందేం? అంటూ ఒకటే టార్చర్‌! వాళ్ళింట్లో ఈయన పెత్తనమేంటసలు?

‘‘అద్దె పన్నెండు వేలు. రెండు నెలల అద్దె ఇరవైనాలుగువేలు అడ్వాన్సు ముందే ఇవ్వాలి. ఏ నెల అద్దె ఆ నెల ఫస్టు తారీఖుకల్లా ఠంచన్‌గా కట్టాలి. బకాయిలు పెట్టకూడదు. మీరు ఇల్లు ఖాళీ చెయ్యాలనుకుంటే మాకు రెండు నెలలు ముందే చెప్పాలి!’’.ఇంటి వోనరమ్మ కాంతమ్మగారి కంఠం కంచులాగా ఖంగున పలుకుతోంది.అద్దె ఇల్లుకోసం వచ్చిన ఆగంతకుడు ఆమె చెబుతున్న కండీషన్లన్నింటికీ తల ఊగిస్తూ ఇల్లంతా కలయతిరుగుతున్నాడు. చూచినగదే మళ్లీమళ్లీ చూస్తున్నాడు. వంటగది, పూజగదీ, స్నానాలగదీ, అలమరలూ, గుమ్మాలు, కిటికీలు ఏ ఒక్కటీ వదలకుండా ప్రతిదీ చూస్తున్నాడు.ఓనరమ్మగారు అతని వెనకాతలే తిరుగుతూ తన కండీషన్లదండకం చదువుతోంది.

‘‘గోడలకు మేకులు కొట్టకూడదు. పంపలు తిప్పేసి నీళ్లు వేస్టు చేయకూడదు. మోటారు రోజుకు రెండుసార్లు మాత్రమే వేస్తాం. ఉదయం ఆరుగంటలకు, మళ్లీ సాయంకాలం ఐదుగంటలకు. మధ్యలో వెయ్యమంటే వేసేది లేదు. రాత్రి పదిగంటలకు బయట మెయిన్‌ గేటుకి తాళం వేస్తాం. అర్థరాత్రి వేళా, అపరాత్రి వేళా వచ్చి బెల్లుకొట్టి తాళం తీయమంటే తీసేది లేదు!’’ఇంటికోసం వచ్చినాయన ‘‘సరేనమ్మా సరే... అలాగే... అలాగే!’’ అంటూ తల ఊగిస్తున్నాడు.ఆమె దండకం చదువుతూనే ఉంది. ‘‘ఇద్దరమే ఉంటాం, ముగ్గురుమే ఉంటామనిచెప్పి, ఆనక ఏడెనిమిదిమంది జనాభా దిగుతుంటారు.

అలా ఉంటానికివీల్లేదు...ఈ విషయం ముందే చెప్పుతున్నా’’ నొక్కి వక్కాణించింది.‘‘మీ ఇల్లు వుంది కదా అని, లేని మనుషుల్ని నేనెక్కణ్నుంచి తేను, ఉండేది నేనొక్కణ్ణే!’’ అద్దె కోసం వచ్చిన పెద్దమనిషి కాస్త విసుగ్గా అన్నాడు.ఆ మాట వినగానే మీద బాంబుపడ్డట్టు ఆమె అదిరిపడింది. ‘‘ఏంటి మీరనేది! ఇంత పెద్ద పోర్షన్లో మీరొక్కరే ఉంటారా? బ్యాచిలర్లకు ఇల్లు ఇవ్వమని ఈ ఆంజనేయులు మీకు చెప్పలేదా? ఏవయ్యా ఆంజనేయులూ!’’ అంటూ గావుకేకపెట్టింది. అంతవరకూ బయట గేటుదగ్గర సెల్‌ఫోన్లో మాట్లాడుతున్న అద్దె ఇళ్ల బ్రోకరు ఆంజనేయులు కాంతమ్మగారి కేకకు కంగారుగా సెల్‌ ఆఫ్‌ చేసేసి పరుగెత్తుకుంటూ వచ్చారు.