తల్లిదండ్రీలేని మనవణ్ణి అల్లారుముద్దుగా పెంచింది నాయనమ్మ. లోకజ్ఞానంలేని ఆ మనవడు ఆమె చెప్పింది తూ.చ తప్పక పాటించేవాడు. అతడి పనులవల్ల బామ్మ ప్రతిసారీ ఇకకాటంలో పడేది. ఎవరేంచెప్పినా ఔను అనమని చెప్పింది నాయనమ్మ. ఓ పెద్దమనిషి ఓసారెందుకో, ఏమీ అనుకోకండి నేను మతిమరపు వెధవని అన్నాడు. ఔను నిజమే అన్నాడు మనవడు. అంత తెలివితక్కువ మనవడి జీవితం చివరకు ఏమైంది?

పూర్వం ఒక ఊళ్లో సుబ్బమ్మ అనే విధవరాలు ఉండేది. ఒక్కగానొక్క కొడుకు నందనుణ్ణి ప్రాణానికి ప్రాణంగా చూసుకునేదామె. తల్లి అతడేమంటే అది జరిపిస్తూ, అతి గారాబంగా పెంచడంవల్లనేమో, నందనుడు చెడు సావాసాలుపట్టి చెడిపోయాడు. కొడుకుని మార్చాలని సుబ్బమ్మ ఎన్నో ప్రయత్నాలు చేసింది. ఒక్కటీ ఫలించలేదు. పెళ్ళి చేస్తే మారతాడని కొందరు పెద్దలు సలహా ఇచ్చారు. అదీ చూద్దామని ఓ మంచి అమ్మాయినిచూసి కొడుక్కి పెళ్ళి చేసింది. కానీ నందనుడు బాగుపడలేదు సరికదా, రోజూ తాగి ఇంటికివచ్చి భార్యను కొట్టేవాడు. అయినా సుబ్బమ్మలో ఆశచావలేదు. కోడలి కడుపున ఓ కాయ కాస్తే కొడుకు మారతాడని ఆశ పడింది. సుబ్బమ్మ కోడలు పండంటి కొడుకుని కన్నది. సుబ్బమ్మ వాడికి చంద్రయ్య అని పేరు పెట్టింది.

నందనుడిలో మాత్రం మార్పేమీ లేదు. పైగా కొడుకును కూడా తనంతటివాణ్ణి చేస్తానంటూ ఆ చంటివాడి నోట్లో సారాయిచుక్కలు పోసేవాడు. భార్య అడ్డువస్తే చితక బాదేవాడు. సుబ్బమ్మ కోడలు ఈ బాధలు భరించలేకపోయింది. ఆమె ఒకరోజు ఊరుచివర ఏట్లోదూకి, ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయింది. ఆ తర్వాత కొద్దిరోజులకే- నందనుడు కొందరు దుష్టులతో పెద్దగొడవ పెట్టుకున్నాడు. ఆ గొడవలో వాళ్లు నందనుణ్ణి చంపేశారు. ఇక సుబ్బమ్మకు మనుమడు చంద్రయ్య ఒక్కడే మిగిలాడు. వాడుకూడా చెడిపోతాడని ఆమె భయం. అందుకని వాణ్ణి బయటకి వెళ్ళనిచ్చేది కాదు. ఎవరితోనూ ఆడుకోనిచ్చేది కాదు. బడికి వెడితే కూడా చెడిపోతాడని భయపడి, వచ్చినంతలో చంద్రయ్యకు తానే అన్నిరకాల చదువులూ నేర్పుతూ పెంచి పెద్ద చేసింది.

నాయనమ్మ అడుగుజాడల్లో పెరిగి పెద్దయ్యాడు చంద్రయ్య. కానీ అతడికి ప్రపంచజ్ఞానం శూన్యం. వాళ్ళింటి పెరట్లో రకరకాల పళ్ళ చెట్లు, పూలమొక్కలు ఉన్నాయి. వాటిని ఎలా సంరక్షించాలో చంద్రయ్యకి నేర్పింది సుబ్బమ్మ. ఏం నేర్పినా వాడి తెలివి అంతంతమాత్రమే కావడంతో సుబ్బమ్మకి వాడితో చాలా అవస్థగా ఉండేది. రోజూ ఉదయం నిద్రలేస్తూనే ముందు పెరట్లో మొక్కలకు నీళ్ళు పోయమని సుబ్బమ్మ మనుమడికి చెప్పింది. చంద్రయ్య అలాగే చేసేవాడు. ఒకరోజు పెద్దగా వాన పడుతోంది. ఆ వానలో తనూ తడుస్తూనే మొక్కలకు నీళ్ళు పోశాడు చంద్రయ్య. సుబ్బమ్మ అది చూసి, ‘‘వాన పడుతుంటే మొక్కలకు నీళ్ళెలాగూ దొరుకుతున్నాయిగా, మళ్లీ నువ్వు నీళ్ళు పోయటమెందుకూ?’’ అంది. ‘‘ఇది నాకు తట్టనే లేదు. నీకు ఎన్ని తెలివితేటలే నానమ్మా!’’ అంటూ చంద్రయ్య ఆశ్చర్యపోయాడు.

ఆ ఇంటి పెరట్లో కాసిన పళ్ళు, పూసిన పువ్వులూ కోసుకునేందుకు ప్రతిరోజూ మాధవయ్య అనే మారుబేరగాడు వచ్చేవాడు. మాధవయ్య ఇచ్చిన డబ్బుతో వారికి రోజులు హాయిగా గడిచిపోయేవి. ఓరోజు మాధవయ్య రాలేదు. రోజు గడిచేదెలా? అని సుబ్బమ్మ కంగారుపడింది. కారణం తెలుసుకు రమ్మని చంద్రయ్యకి చెప్పింది. అయితే వాడక్కడ ఏం సమస్య తెస్తాడోనన్న భయంతో చంద్రయ్య వెళ్ళేప్పుడు, ‘‘ఒరేయ్‌, అక్కడ మాధవయ్య ఏం చెబితే దానికి నువ్వు ఔననాలితప్ప దేనికీ కాదనకూడదు, తెలిసిందా?’’ అని సుబ్బమ్మ మరీమరీ మనుమణ్ణి హెచ్చరించింది. చంద్రయ్య అలాగేనని తలూపి వెంటనే బయల్దేరాడు. మాధవయ్య ఇల్లు కాస్త దూరం కావడంతో చేరుకునేందుకు కాస్త సమయం పట్టింది. మాధవయ్య చంద్రయ్యను చూస్తూనే, ‘‘ఈ రోజు మా ఇంటికి చుట్టాలొచ్చారు. ఇంట్లో కాస్త హడావుడిగా ఉంది. పళ్ళు, పువ్వులు కాస్త ఆలస్యంగా వచ్చి తీసుకుని వెడతాను. పాపం, నువ్వు శ్రమపడి అనవసరంగా ఇంతదూరం నడిచి వచ్చావు. ఈ విషయం మీ ఇంటికి ముందుగా కబురు పంపించాలని గట్టిగా అనుకున్నాను. కానీ మరచిపోయాను. నేను ఉత్త మతిమరుపు వెధవని’’ అని నొచ్చుకున్నాడు.