ఈ ప్రపంచంలో అత్యంత ఆకర్షణీయమైన ఏకైక మహాశక్తి స్ర్తీ మాత్రమే. మంచికి ఉపయోగిస్తే అది ఆదిశక్తి, దుష్టకార్యాలకు ఉపయోగిస్తే అది క్షుద్రశక్తి. ఈ కథలో ఈ రెండు శక్తులకూ ప్రతినిధులైన ఇద్దరు యువకుల మధ్య రాజకుమారి తన అమాయకత్వంతో సృష్టించిన సమస్య ఇద్దరికీ పెద్ద ప్రశ్నార్థకంగా మారిపోయింది. ఇంతకీ అసలు వారిమధ్య వచ్చిన సమస్య ఏమిటి? ఆ సమస్య ఎలా పరిష్కారమైంది?

వింధ్యాటవీప్రాంతంలో చోళకుడనే మాంత్రికుడు ఉండేవాడు. అతడు విపీల అనే క్షుద్రదేవతను ఆరాధించి, ఎన్నోశక్తులు సంపాదించాడు. ఒకరోజు అతడు, విపీల విగ్రహం ముందు సాష్టాంగపడి, ప్రపంచాన్ని జయించాలన్న తన కోరిక చెప్పుకున్నాడు. ‘‘అందుకు నువ్వు కళింగదేశ రాజకుమారుడు జయపాలకుణ్ణి పట్టి తెచ్చి, నాకు బలి ఇవ్వాలి. అయితే, జయపాలకుడు శక్తివరప్రసాదుడు. నా మందిరంలో తప్ప మరెక్కడా నీ మాయలు అతడిపై పనిచేయవు. ఎలాగైనా అతడిని ఈ మందిరానికి రప్పించు. నీ అభీష్టం సిద్ధిస్తుంది’’ అని విగ్రహంలోనుంచి విపీలవాణి వినిపించింది.తన శక్తియుక్తులన్నీ ఒక రాజకుమారుడిముందు వృథా అవుతాయని చెప్పిన క్షుద్రదేవత విపీల మాటలు మాంత్రికుడికి బాధ కలిగించాయి. అయినా నిరుత్సాహపడకుండా చోళకుడు తన మందిరం వదిలి, ఆకాశ గమనం ద్వారా కళింగరాజ్యం చేరుకున్నాడు.

జయపాలుడి గురించి ఆరా తీశాడు.కళింగదేశానికి పొరుగున ఉన్న చంచలదేశ రాజకుమారి సుచల అందచందాలలో సాటిలేనిదని పేరుకెక్కింది. ఆమెను జయపాలుడు ప్రేమిస్తున్నాడు. కొద్దివారాలలో సుచలకు స్వయంవరం జరుగనున్నది. సుచల తననే వరించగలదని జయపాలుడు నమ్ముతున్నాడు.దాంతో చోళకుడు తిన్నగా చంచలదేశానికివెళ్లి, ఆ దేశ రాజును కలుసుకుని, ‘‘నా పేరు చోళకుడు. నేనొక మహామాంత్రికుణ్ణి. వింధ్యాటవీప్రాంతంలో ఉంటున్నాను. ఇప్పుడు నీ కుమార్తెను అపహరించుకుపోవాలని వచ్చాను. నా దగ్గరకు వచ్చి నన్ను జయించి ఆమెను వెనక్కు తీసుకురాగల ధీరుడికే ఆమెనిచ్చి పెళ్ళిచేస్తానని ప్రకటించు’’ అన్నాడు. ఆ రాజు బదులిచ్చేలోగానే, చోళకుడు అంతఃపురంలోనికి వెళ్లి, సుచలచేయి పట్టుకున్నాడు.

మరుక్షణం ఇద్దరూ అక్కణ్ణించి మాయమై చోళకుడి మందిరానికి చేరారు.సుచలకు అంతా అయోమయంగా ఉంది. చోళకుణ్ణి చూసి, ‘‘ఎవరు నువ్వు? నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు?’’ అని అడిగింది. అతడామెకు నెమ్మదిగా తనగురించీ, తన ఆశయంగురించీ చెప్పి, ‘‘నీ కోసం జయపాలుడు తప్పక ఇక్కడికి వస్తాడు. అప్పుడతణ్ణి నా దేవత విపీలకు బలి ఇచ్చి, ఈ ప్రపంచానికే ఏలికనౌతాను’’ అన్నాడు. ‘‘మరి ఆ తర్వాత నన్నేం చేస్తావు?’’ అడిగింది సుచల.