రేడియో మోగుతూంది. అప్పుడే వచ్చిన హిందూ పేపరు చదువుతూ కూర్చున్నాను. ములిగిపోయాను యుద్ధ వార్తల్లో.‘‘నాన్న, పాట చాలాబాగుంది కదూ.’’‘‘అవునమ్మా చాలా బాగుంది’’ సమాధానం చెప్పాను యధాలాపంగా.‘‘సాహిత్యం బాగుందా, సంగీతం బాగుందా నాన్నా?’’‘‘రెండూ బాగానే వున్నాయమ్మా’’ అన్నాను, మళ్ళీ పరధాన్యంగానే.

‘‘కలదీ గాలిని గారడి యేమో అదియే కద ఆ ప్రేమ!’’అప్పుడే రేడియోలో వచ్చిన పాటను తన కోకిల స్వరంతో మెల్లిగా పలికింది సులోచన.‘‘నాన్నా, ప్రేమంటే యేమిటి నాన్నా?’’ఒక్కసారి స్మృతిలోకి వచ్చాను. అబ్బ! ఎంత పెద్ద ప్రశ్న వేసింది? నా బిడ్డ! సులోచనకు ప్రేమంటే యేమిటో చెప్పగల శక్తి నాకుందా? ఏనాడో ముదిరిపోయి కుళ్ళిపోవడానికి సిద్ధంగా వున్న యీ కట్టెకు ప్రేమ అంటే అసలు అర్థం తెలుసా? తెలిసినా చెప్పగల శక్తి వుందా? అందులోను, తల్లి లేని నా బిడ్డ సులోచనకు ఎలా చెప్పగలను?భగవంతుడా! ఈ రోజు కోసమా నే నిన్నాళ్ళు ఎదురుచూసింది. పొరపాటున పుట్టింది సులోచన, నా కడుపున! పేరు సులోచన - పాపం, అంధురాలు! అదీవొక దైవికమే కాబోలు. అందుకేనా నన్ను చూస్తే నీ కింత హేళన!నా తల తిరిగి పోతూంది.

ప్రేమ అనే రెండక్షరాలకు సరయిన సమాధానం చెప్పగల మగధీరుడెవరయ్యా ఈ లోకంలో!ఎవరికివారే తామనుకున్న అర్థాన్ని వెలిబుచ్చుతూ, తమ చీకటి గదుల లోని అనుభవాల పర్యవసానాన్ని లేక నీచ లైంగిక జ్ఞానాన్ని పునరుద్ఘాటించుకొని, ఏవో కల్లిబొల్లి మాటలు చెబుతూ, ప్రజలను మోసం చెయ్యడానికి సిద్ధపడే ఈ చవట ప్రేమికులా చెప్పగలరు, ప్రేమంటే యేమిటో!ఈ రోజు వరకు యే మహా ప్రేమికులు గాని ... రోమియో - జూలియట్‌, అనార్కలీ - సలీము, లైలా - మజ్నూలు, అనుభవించారే కాని, అది ఏమిటో వారికీ తెలియదే!‘‘ప్రాణం’’ అంటే యేమిటో చెప్పగల శక్తి ఈ మానవునికి వుందా? అలాగే ‘ప్రేమ’ అంటే కూడా అర్థం కాదు ఈ మానవ జీవికి. ప్రాణం అంటే యేమిటో చెప్పగల భగవంతుడే ప్రేమ అనే ముక్కకు గూడా సమాధానం చెప్పాలి.