సువర్ణ పుష్పాలురచనః వసుంధరఒకానొకప్పుడు అవంతీ నగరంలో విశ్వసేనుడనే భాగ్యవంతుడు ఉండేవాడు. దానగుణంలో ఆయనకి ఆయనే సాటి అని చెప్పాలి. తన ఇంటికొచ్చి దేహీ అని చేయి చాచిన వారికందరికీ ఎంతోకొంత దాన మివ్వడమే కాక ప్రతిరోజూ రెండు పూటలూ అన్నదానం కూడా చేసేవాడు. అయితే, అలా ఎంతకాలం జరుగుతుంది? చూస్తూండగానే ఆయన ఆస్తి కరిగిపోయింది.విశ్వసేనుడికి ముగ్గురు కొడుకులు. వాళ్లు పెరిగి పెద్దవారవుతున్నారు. తండ్రి చేసే దానాలు చూసి, ముందుముందు తమ గతి ఏమవుతుందోనని తల్లి సుమతి దగ్గర బాధ పడుతుండేవారు. అందుకని ఆమె ఈ విషయమై, 'మీరింక ఈ దానాలు మానండి. లేకుంటే కొన్నాళ్లకు మన బిడ్డలకు తినడానికి తిండికూడా ఉండదు' అని తరచుగా భర్తను హెచ్చరిస్తూ ఉండేది. కానీ విశ్వసేనుడు దానాలు మానలేడు. భార్య మాటల్లో నిజం లేదనలేడు. ఆయన క్రమంగా దిగులుతో కృశించి పోతుంటే, ఒకరోజున ఆయనకు కలలో భగవంతుడు కనిపించి, 'ఓయీ, విశ్వసేనా! నువ్వెంతో పుణ్యాత్ముడివి. నీవంటి మనిషి పిల్లల భావికోసం బెంగ పెట్టుకొని కృశించి పోవడం తగని పని' అని మందలించాడు.విశ్వసేనుడు దేవుడికి నమస్కరించి, 'దేవా, నా బెంగ నా బిడ్డలు పేదవారై పోతున్నారని కాదు. నాకు బిడ్డలు ముగ్గురు మాత్రమే. కానీ వేలాది పేదలెందరో నామీద ఆధారపడి ఉన్నారు. నా ఆస్తి కరిగిపోతున్నది. వారినందరినీ ఎలా ఆదుకుంటానా అన్నదే నా దిగులుకు కారణం' అన్నాడు. భగవంతుడు ఎంతో సంతోషించి, 'నీ మాటలు నాకు అపరిమితానందాన్ని కలిగించాయి. రేపటి నుంచి నీ తోటలో పూచిన ప్రతి వూవూ నీ స్పర్శతో సువర్ణపుష్పంగా మారిపోతుంది. ఆ బంగారంతో నీ దానధర్మాలు యథావిధిగా కొనసాగించు' అని చెప్పాడు.మర్నాడు నిద్ర లేచిన తరువాత, తనకొచ్చిన కలలో ఎంత నిజమున్నదో చూడదలచిన విశ్వసేనుడు కాలకృత్యాలు తీర్చుకుని పట్టు బట్టలు ధరించి, పూల సజ్జతో తోటలోకి వెళ్లాడు. అప్పుడాయన కోసిన ప్రతి పూవూ సువర్ణ పుష్పంగా మారిపోయింది. జరిగిన వింతకు ఆశ్చర్యపడిన విశ్వసేనుడు అప్పటికప్పుడు భగవంతుడి లీలలను స్తోత్రం చేస్తూ కొనియాడాడు. ఆ తర్వాతనుంచీ, ఆయన దానం చేయడానికి ఎప్పుడూ ఇబ్బంది పడలేదు.