ఒంగోలు పట్టణంలో అదొక పాత సినిమాహాలు.దాని యజమాని ప్రేక్షకుల ఆనందంకోసం తాపత్రయపడుతూ, తన సినిమాహాలుకు ఎప్పటికప్పుడు కొత్త సొబగులు చేకూరుస్తూనే ఉంటాడు. అయినా అది పాత పరిమళాలు వెదజల్లుతూనే ఉంటుంది. కానీ అతను ఊరుకోడు. దానికితగ్గ మేనేజరే చలపతి.గతంలో ఎక్కువగా ఆలోచిస్తూ ఎక్కువ సిగరెట్లు తాగేవాడు. ఆ ఆలోచనలు ఏ మాత్రం అలజడి సృష్టించినా కాస్త మందేసి ఉపశమనం పొందేవాడు. కానీ ఈమధ్య వాటికి దూరంగా ఉన్నాడు. 

దానికి కారణాలున్నాయి.ఆ రోజు రెండవ ఆట వదిలారు. జనం చిన్నగా బయటకు వెళ్ళిపోయారు. వాచ్‌మన్‌ అన్ని తలుపులు మూసేసి గేటుకి తాళంకూడా వేసి ఆఫీసు పక్కన వరండాలో చాపవేసుకుని పడుకున్నాడు.చలపతి ఆఫీసు గదికి చేరుకున్నాడు. అతని నిద్ర అక్కడే. హాలు యజమాని బాల్యమిత్రుడు కావడంవల్లనే చలపతికి ఆ వెసులుబాటు.చిన్నగా సోఫాలో నడుమువాల్చాడు. ఆ సమయానికి రోజూవచ్చే ఆలోచనలు ఆ రోజూ అతడిని చుట్టుముట్టాయి. ఆ హాల్లో ప్రదర్శించే సినిమాల్లోని కొన్నిసంఘటనలు తన జీవితానికే సంబంధించినవిగా అనిపిస్తుంటాయి చలపతికి. సినిమాల్లో మూడుగంటల్లో అన్నీ పరిష్కారమైపోతాయి. శుభం కార్డు పడిపోతుంది.

కానీ నిజజీవితం అలాకాదు. సుదీర్ఘ పోరాటం చెయ్యవలసిందే! జీవితంలోని ప్రతిఘట్టంకోసం తాపత్రయపడాల్సిందే! అతడి ఆలోచనల్లాగానే సోఫాపైన ఫ్యాను గిర్రున తిరుగుతోంది. చలపతి మనసేమిటో ఆ ఫ్యానుకు బాగా తెలుసు. తెల్లవారుఝాముదాకా అతడి ఆలోచనలన్నిటినీ అదీ పంచుకుంటూ గిర్రున తిరుగుతూ ఉంటుంది. మళ్ళీతనే అతడిని సేదతీర్చి మెల్లగా అతడిని నిద్రలోకి జారవిడుస్తుంది.మరుసటిరోజు చలపతి కాస్తముందే నిద్రలేచి తయారయ్యాడు. పది కిలోమీటర్ల దూరంలో ఉన్న తన గ్రామానికి బయలుదేరాడు. అక్కడ అమ్మవారిగుడిలో పూజచేసి రావాలి. తనకు ఇష్టం లేదు. కానీ తన భార్యకి ఎంతో ఇష్టం. ప్రతినెలా మొదటి ఆదివారం తప్పకుండా ఆ గుడిలో పూజ చేయించేది.