ఒక్కసారిగా మెలకువ వచ్చింది వనజాక్షికి.ఆకలిగా ఉంది.దాహంగా ఉంది.శరీరంలోని రక్తాన్నంతా ఎవరో తోడేసినట్టుగా నీరసంగా వుంది.కాళ్ళూ, చేతులూ కూడదీసుకుని అతికష్టమ్మీద లేచి కూర్చోగలిగింది వనజాక్షి. కిటికీలోంచి బయటకు చూసి, తెల్లారిందనుకుంది.నిజానికి ఆ వాతావరణం తెల్లారినప్పటిది కాదు. మధ్యాహ్నం వేళ, మబ్బు పట్టి ఉండడంతో అలా అన్పిస్తోంది. అలా అని ఎలా తెలుసుకోగలిగిందంటే...పక్కలో భర్తా, ఆ మూలగా నిద్రించే ఆడపడుచూ లేకపోవడంతో తెలుసుకోగలిగింది వనజాక్షి.ఒళ్ళు విరుచుకుంది. కళ్ళు తిరిగినట్టనిపించాయి. మెల్లగా నడిచి వెళ్ళి మూడు గ్లాసుల నీళ్ళు తాగి ‘బ్రేవ్‌’మని తేన్చి కూర్చుంది.మేడమీద గదిలోంచి రేడియోలోని పాట కిందికి జారి వినవస్తోంది.‘ఉండి ఉండి చర్నాకోలా ఛెళ్‌ మన్నాది!ఈ పిల్లదాని గుండెలోన ఝల్లుమన్నాది!’కవిగారి భావం తెలుసుకుని నీరసంగా నవ్వుకుంది.రేడియో వినవస్తున్నదంటే గదిలో రామకృష్ణ వున్నాడన్నట్టే! సెలవు పెట్టాడా? లేక బ్యాంక్‌కు సెలవా? కాస్సేపు ఆలోచించింది.కడుపులోంచి ఏదో శబ్దం!పేగులు లుమ్మచుట్టుకుపోతూ, కాగితాల్ని నలిపినపుడొచ్చే శబ్దంలా వినవస్తోంది.కుచ్చెళ్ళు ఎత్తిపట్టి బొడ్డు దగ్గరగా చూసుకుంది వనజాక్షి. పొట్టను పిడికిలి పట్టి వదిలింది. ‘బుజ్జి ముండకి ఆకలి’ అనుకుంది.

ఉదయాన్ననగా బొక్కిన మెతుకులు. అరగిపోక ఇంకా వుంటాయా? ఏదయినా తినాలి. పట్టెడు మట్టయినా సరే!చిన్నతనంలో మట్టిని తినేదట తాను. తల్లి చెప్పింది. కసిరినా, కొట్టినా వెన్నముద్దలా మట్టిని చేతబట్టుకొని మింగేదట! ‘తప్పు! కూడదు’ అని పదే పదే చెబితే మానిందట. లేకుంటే ఎంత బాగుణ్ణు.దేశంలో మట్టికి కొరత లేదు.‘అందాన్ని చూశాడమ్మాఅందలం ఎక్కాడమ్మాఎంతవాడు, ఎంతయినానీలోనే ఇమిడిపోతాడమ్మా’రామకృష్ణ రేడియో శ్రోతలు కోరిన సినిమా పాటల్ని వినిపిస్తోంది. పాట పాటంతా బూతుగా వుంది. బూతుగా వున్నా, బురదలో బాతు నడకలా ఘంటసాల గొంతులో మెత్తమెత్తగా బాగుంది.గది తలుపులు మూసి, మేడమీదికి నడిచింది వన జాక్షి. నడుస్తూ, బొడ్డు కన్పించేలా కుచ్చెళ్ళనొకసారి కిందికి లాగి, పైటని వక్షోజాల మధ్యగా పాయగా నిలిపింది. పెదవుల్ని తడిజేసుకుని, పగిలిన చేతి మడమల్ని నాలికతో నాకింది.మంచమ్మీద వెల్లకిలా పడుకుని, చేతుల్ని తలకి దిండుగా చేసుకుని నిద్రిస్తున్నాడు రామకృష్ణ.