రుక్మిణి పట్టుచీర కట్టుకుని, బీరువాలో సొమ్ములన్నీ తీసి అలంకరించుకున్నది. దువ్వుకున్నతలనే మరోసారి పైపైన దువ్వుకుని చివరిసారిగా కాస్తంత పౌడరు ముఖానికి అద్దుకున్నది. ఆరునెలల్లో యాభై రాబోతున్నా ఆ ఇంటి మొత్తానికి తనొక్కతే ఆడమనిషి అవ్వటంతో ఇంకా చిన్నపిల్లనే అనుకుంటుంది. ఆపైన తన అందాన్ని నలుగురూ కళ్ళు పెద్దవి చేసుకుని చూస్తుంటే ఆమెకు అదో ఆనందం.

‘‘రాహుకాలం వచ్చిందాకా ఆ అద్దం ముందు కూర్చో ఇంతవరకూ అయినట్లుగానే ఈ సంబంధమూ గంట కొట్టేస్తుంది!’’‘‘అంటే ఇదివరకు వెళ్ళిన పెళ్ళి చూపులన్నిటికీ రాహుకాలంలో వెళ్ళామనా? అయినా శుభమా అని బయల్దేరుతూ ఆ అపశకునపు మాటలేమిటి?’’ భర్త మాటలకు విసుక్కుంది రుక్మిణి అద్దం ముందు నిలబడి పమిటచెంగును సర్దుకుంటూ. ‘ఈ పట్టుచీరకు ఇంకో బెత్తెడు వెడల్పు జరీవుంటే చాలా బాగుండేది’ అనుకున్నది.‘‘మంచి సమయంచూసుకుని వెళ్ళిన సంబంధాలే కుదరలేదు, ఇక రాహుకాలంలో వెళ్ళిన సంబంధం ముగింపెలా ఉంటుందో ముందేతెలిసిపోతుందిలే’’ అని ‘‘అన్నంతమాత్రాన అపశకునంగా ఎందుకనుకుంటావ్‌!’’ చికాగ్గా అన్నాడు ఆమె భర్త లక్ష్మీనారాయణ.వాళ్ళకు ఒక్కడే కొడుకు. మాదాపూర్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి. సంవత్సరానికి పది లక్షలు జీతం.

ఇరవైఏడేళ్ళు వచ్చినా పెళ్ళికి తొందరపడడు. ఏ సంబంధం చెప్పినా చూద్దాంలే అంటాడు.పిల్లలపెళ్ళిళ్ళ విషయంలో పూర్వంలాగా తల్లిదండ్రుల పెత్తనం ఇప్పుడు నడవటం లేదు. అబ్బాయిలతో సమానంగా అమ్మాయిలూ సంపాదిస్తున్నారు. పెద్దవాళ్ళంతా హాల్లో కూర్చుని టిఫిన్లుతింటూ లోకాభిరామాయణం మాట్లాడుకుంటూ ఉంటే పెళ్ళికూతురూ, పెళ్ళికొడుకూ పక్కగా ఓ గదిలో కూర్చుని ఒకర్నొకరు భార్యాభర్తలగా అంగీకరించటంలో ఉండే లాభనష్టాలను అంచనాలు వేసుకుంటారు. వాళ్ళు పచ్చజండా ఊపితే పెద్దవాళ్ళు తామేదో ఆ సంబంధాన్ని అంగీకరించినట్లుగా సంబరపడటం.