కురుచన్న పేరుకు తగ్గట్టే చాలా పొట్టిగా ఉండేవాడు. అందరూ అతడిని గేలి చేస్తుంటే అతడెంతో బాధపడేవాడు. ఆ తర్వాత అతడు ఓ బైరాగి మహత్మ్యంవల్ల చాలా ధనవంతుడయ్యాడు. ఊళ్ళో అందరూ ఈర్ష్యతో అతడిని స్వార్థపరుడని తిట్టిపోసేవారు. అలా ఊళ్ళోవాళ్ళు తిట్టేకొద్దీ అతడింట బంగారుకాసులవర్షం కురిసేది. ఊళ్ళో ఎవరైనా బాధలు పడుతుంటే, రహస్యంగా ఆ కాసులు ఖర్చుపెట్టేవాడు. అతడు ఎందుకు అలాచేశాడు? బైరాగి శాపమే కారణమా?

విక్రమార్కుడు తన పట్టుదల వదలలేదు. తిరిగి చెట్టువద్దకు చేరుకున్నాడు. చెట్టెక్కి బేతాళుడు ఆవహించిన శవాన్ని దించి భుజాన వేసుకున్నాడు. ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవాన్ని ఆవహించిన బేతాళుడు, ‘‘రాజా, సుఖనిద్ర చేయాల్సిన ఈ సమయంలో ఇక్కడ ఇలా నన్ను మొయ్యడానికి తాపత్రయపడుతున్నావంటే, నువ్వా భిక్షువునుంచి ఏదైనా వరాన్ని ఆశిస్తున్నావని నాకు తోస్తోంది. అయితే వరాలు కూడా ఎల్లవేళలా కలిసిరావు. వెనుకటికి వరాన్ని ఆశించిన కురుచన్న ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. శ్రమ తెలియకుండా నీకా కథ చెబుతాను విను’’ అంటూ ఇలా చెప్పసాగాడు.పూర్వం పల్లవరం గ్రామంలో కురుచన్న అనే పేదవాడు ఉండేవాడు.

వాడు బాగా పొట్టిగా ఉండడంవల్ల, ఊళ్లోవాళ్లంతా చీటికీ మాటికీ వాణ్ణి ‘‘ఒరేయ్‌ పొట్టీ!’’ అని పిలిచి వేళాకోళం చేసేవారు. ఇది కురుచన్నకు చాలా బాధగా ఉండేది. ఒకసారి ఆ గ్రామానికి అద్భుతశక్తులున్న ఓ బైరాగి వచ్చాడు. ఆయన ఊళ్లోవాళ్లముందు గాలిలో ఎగిరాడు. నీటిపైన నడిచాడు. గాలిలోంచి బొమ్మలు సృష్టించి జనాలకు కానుకగా ఇచ్చాడు. ఊరి జనం ఆయనకు బ్రహ్మరథం పట్టారు. ఆయన్ని దేవుడికంటే ఎక్కువగా చూశారు.బైరాగి సామాన్యుడుకాదని గ్రహించిన కురుచన్న ఒకసారి ఏకాంతంలో ఆయన్ని కలుసుకుని తన గోడుచెప్పుకున్నాడు.

తనుకూడా మిగతావారిలా పొడుగ్గామారే ఉపాయం ఏదైనా చెప్పమని దీనంగా వేడుకున్నాడు. బైరాగికి వాడి పరిస్థితి అర్థమైంది. అయితే ఆయన వాడికి పొడుగ్గా ఉండే ఉపాయం చెప్పకుండా, ‘‘ఎవరికి ఏమివ్వాలో దేవుడికి తెలుసు. నువ్వు పొట్టిగా ఉన్నందుకు బాధవడకు. లోకంలో చాలాచోట్ల చాలామంది పొట్టివాళ్లున్నారు. వాళ్లు సుఖసంతోషాలతో జీవిస్తున్నారు. నువ్వూ దేవుడు ఇచ్చిన సహజరూపానికి చిన్నబుచ్చుకోకుండా సంతోషంగా ఉండడం నేర్చుకో’’ అన్నాడు.