ఉన్నట్లుండి కెవ్వుమన్న పెద్ద కేక వినిపించగానే, వినయశీలుడు ఆశ్చర్యపడి అటు చూస్తే- మహారాణి నేలమీదపడి గిలగిల కొట్టుకుంటోంది. వినయశీలుడు కంగారుపడి, ‘‘ఏమైంది మహారాణీ?’’ అన్నాడు.మహారాణి అతడికి ఏదో చెప్పబోయింది. గొంతు పెగలలేదు. చెయ్యి కదపాలని చూసింది. కదలలేదు. కాలు కదపబోయింది. కదలలేదు. ఎలాగో అలా కదలాలని ప్రయత్నిస్తే మనిషంతా ఊగిపోతోంది తప్ప, శరీరంలో ఏ భాగమూ విడిగా కదలడం లేదు.

‘‘ఏమైంది మహారాణీ?’’ అన్నాడు వియశీలుడు మళ్లీ. ఏమీ చెప్పలేక నిస్సహాయంగా అతడివైపు చూసింది రాణి. అది గమనించిన వినయశీలుడు, ‘ఇన్నిరోజులుగా కథలు వింటున్నా, మహారాణికి ఏమీ కాలేదు. నూరో కథ వినగానే ఈమెకు ఏమైంది?’ అనుకుని కంగారు పడ్డాడు.ఆమె మాట్లాడలేని స్థితిలో ఉంది కాబట్టి, తనకి జవాబివ్వగలిగింది ఒక్క పిశాచం మాత్రమేనన్న ఉద్దేశ్యంతో, ‘‘పిశాచ మహాశయా! ఉన్నట్లుండి మా రాణికి ఏమైంది?’’ అనడిగాడు. వినయశీలుడికి పిశాచం నుంచి ఎలాంటి బదులూ రాలేదు. ‘‘పిశాచ మహాశయా! పిశాచ మహాశయా!’’ అంటూ వినయశీలుడు మళ్లీ మళ్లీ పిలిచాడు. కానీ అతడికి బదులురాలేదు.పిశాచ మహాశయుడు తనను వదలివెళ్లిపోయాడని వినయశీలుడికి అర్థమైంది.

తన కారణంగా నూరుకట్లనూ తెంచుకున్న ఆ పిశాచం తనతో మాట మాత్రం చెప్పకుండా వెళ్లిపోవడం అతడికి నచ్చలేదు. ‘అన్ని జన్మలలోకీ ఉత్తమమైనది మానవజన్నే అంటారు. అలాంటి మనుషులకే కృతజ్ఞత ఉండడం లేదు. ఇక పిశాచాలకు కృతజ్ఞత ఉంటుందా?’ అని అతడు సరిపెట్టుకున్నాడు.కానీ మహారాణికిపట్టిన దుర్దశ ఏమిటో, ఎందుకు ఆమెకు అలాంటి దుర్దశ కలిగిందో అతడికి అర్థం కాలేదు. అందుకని అంతఃపురదాసిని పిలిచి విషయం చెప్పాడు. దాసి వెంటనే వెళ్లి చక్రవర్తికి కబురు అందజేసింది. ఆ సమయానికి చక్రవర్తి ఓ ముఖ్యవిషయమై మంత్రులతో సమాలోచనలో ఉన్నాడు. రాణి అనారోగ్యం గురించి వినగానే ఆయన వెంటనే సమావేశాన్ని రద్దుచేసి ఉన్నపళంగా మహారాణిని చూడబోయాడు.