రిటైరయ్యాక చాలామందికి కాలం ఎలా వెళ్ళబుచ్చాలో తెలియదు. పాత కలలు నెరవేర్చుకోవాలనీ, కొత్త ప్రయోగాలు చేయాలనీ అనుకుంటారు. ఈ కథలో ధవళే‘స్వరం’ కూడా అలాంటివాడే. రాత్రికి రాత్రే కలగన్నాడు. వాసనోపతి వైద్యశాస్త్రానికి తనే ఆద్యుడైపోవాలనుకున్నాడు. ప్రయోగాలు ప్రారంభించాడు. అతడి శాస్త్రాధ్యయనాన్ని వీధిలో ఎంతోమంది అడ్డుపడ్డారు. కుట్రచేశారు. అతడిని ఏకంగా ఇంట్లోంచే వెళ్ళగొట్టే ప్రయత్నం చేశారు. అప్పడు ధవళే‘స్వరం’ ఏంచేశాడంటే.......

******************************

‘‘ఆ ఇంటిముందు ఆ సింహాల బొమ్మలు ఎంతో అందంగా ఉన్నాయి కదండీ’’ అంది తాండ్ర ఆనందాన్ని ఆస్వాదిస్తూ, కళ్ళతో చూపిస్తూ.‘‘అవి పాలరాతి శిల్పాలు’’ చెప్పాడు ధవళేశ్వరం.‘‘ఏమండీ మీరెప్పుడన్నా తెల్లసింహాన్ని చూశారాండీ’’ అడిగింది.‘‘నేను దండకారణ్యం వెళ్లి తిరిగి రాగలిగితేనే నీకు ఏ విషయం చెప్పగలుగుతాను’’‘‘మిమ్మల్నేం కాళ్లీడ్చుకుంటూ కారడవుల్లోకి దూరమనడంలేదు. ఆ జీవుల్ని చూడడానికి జీపులున్నాయి. ఖర్చు చేయగలిగితే హెలీకాఫ్టర్లూ ఉన్నాయి’’.‘‘అంత డబ్బు మన దగ్గరుండాలిగా’’.‘‘ఉంది కాబట్టే’’‘‘నాకు తెలియకుండా నా దగ్గరున్న డబ్బు నీకెలా తెలుసో’’‘‘మీరు ఇంకో బ్యాంకులో అకౌంట్‌ మెయింటేన్‌ చేస్తున్నారని తెలుసుకోవడం పెద్ద గొప్ప విషయమేంకాదు గదా’’.‘‘డబ్బువాసన పసిగట్టడంలో ఆడవాళ్లకు మించిన పుడకవేసిక ముక్కులేదంటే లేదనే చెప్పాలి’’.‘‘చెప్పకుండా చేసి, చెప్పకుండా ఉండడంలో మిమ్మల్ని మించిన అందెవేసిన చేయి ఉందంటారా’’.‘‘కలిసొస్తే ఓ గూడు కట్టుకుందామని, ఓ గూటి పక్షులం అవుదామని’’.

‘‘గూడు లేదు, పక్షుల్లేవు. ఓ చిన్నోచితకో ఇల్లు కొనుక్కుంటే చాలు’’.‘‘ఏదో ఒకటి, నీకు తెలియకుండా చేయబట్టే మంచి జరిగింది’’.‘‘అంటే. తెలిస్తే మంచి జరిగుండేది కాదనా మీరనేది! ఎప్పుడైనా పట్టుచీరలు కొనిపెట్టమని పట్టుపట్టానా? ఏడు వారాల హారాలు మెడచుట్టమని పోరుపెట్టానా?’’.‘‘ఒకే చీరతో రోజులు మార్చుతూ నీవూ, వ్యసనాల కోసం ఆసనాలు వేయకుండా నేనూ ఉండబట్టే, ఇంటిపట్టుకోసం ఇటుక పట్టుకోగలుగుతున్నాం’’.‘‘మీ మాట మీద మాట వేసేదాన్ని కాదు కానీండి, ఇంటిముందు రెండు తెల్ల సింహాలు...’’ చెప్పీ చెప్పకుండా కోరిక చెప్పింది తాండ్ర.

************************

‘‘ఏమండీ! కాలంపరుగుని మనమెలాగూ ఆపలేం కానీండి, మన ఇల్లు పునాదులు పూడ్చుకున్నాయా, గోడలదాకా ఎదిగిందా, నెత్తిమీద కప్పు కప్పుకుంటోందా’’ అడిగింది తాండ్ర ఆనంద తన్మయత్వంతో. ‘‘కట్టిన ఇల్లు కొనుక్కునే దాకా వచ్చింది’’.