‘‘ఎకరాకి నలభై బస్తాల చొప్పున మూడెకరాలకి నూటిరవై బస్తాలు. నీ వడ్లుకి బస్తాకి వెయ్యి మీద యాభై ఇస్తానన్నాను కదా! మొత్తం మీద ఎంతవుద్దీ’’ నోట్లోనే లెక్కలు వేసుకుంటూ అన్నాడు బుల్లబ్బాయి.‘‘అదేంటి బుల్లబ్బాయ్‌, మా అన్నకు వెయ్యి మీద అరవై ఇస్తానన్నావంటగదా... నాకు పది తగ్గించా వేంటి? నాకూ అదే రేటు ఇయ్యి’’ అన్నాడు నారాయణ.

‘‘నువ్వు కుప్పలు వేసినప్పుడు నీ పంట నాణ్యం చూశాను కదా, నీకు అంతే రేటు వస్తాది. నువ్వు సరే అన్నాకే కదా లోడు తీసుకెళ్ళాను. ఇప్పుడు మాట మారిస్తే కుదరదు. అయినా నేను లెక్క పెట్టేటప్పుడు నన్ను తిరకాసు పెడతావేంటి?’’ విసుగ్గా అని మళ్ళీ నోట్లో లెక్క వేసుకోసాగాడు బుల్లబ్బాయి.‘‘ఒక లక్షా ఇరవై ఆరు వేల రూపాయలు’’ అంది అక్కడే కూర్చుని బియ్యంలో వడ్లు ఏరుతున్న సీత.గుర్రుగా చూశాడు బుల్లబ్బాయి ఆమె వైపు. ‘ఎటువంటి లెక్కయినా నోటితో చేసేస్తుంది సీత.

అయినా వ్యాపారం అంటే లెక్కలొకటేనా ఏంటి? ఎంతమందితో మాట్లాడాలి... ఎన్ని ఎత్తులు, పై ఎత్తులు ఉంటాయి... ఆదమరిచి ఉంటే ముంచేస్తారు ఈ జనాలు’ అనుకున్నాడు బుల్లబ్బాయి.‘‘నీకెందుకు ఈ లెక్కలవీను. వెళ్ళి ఆ పలక తీసుకురా, నా లెక్కలు నేను చేసుకోగలనుగాని’’ అన్నాడు బుల్లబ్బాయి భార్యను విసుక్కుంటూ.చేట పక్కనపెట్టి లేచి వెళ్ళి పలక, బలపం తెచ్చి ఇచ్చింది సీత. ఆమె చెంగు అందుకుని పలక తుడుచుకున్నాడు బుల్లబ్బాయి.‘‘నా చీరే దొరికిందేంటి నీ పలక తుడుచుకోడానికి’’ కసురుకుంది సీత.‘‘అదికాదే, నాకు అచ్చొచ్చిందే’’ అన్నాడు బుల్లబ్బాయి నవ్వుతూ.