పురుషోత్తం లోకల్‌ ట్రైన్‌ దిగి రోడ్డుమీదకొచ్చాడు.ప్రక్కనే అనాథ శరణాలయం.రోజూ ఒక గంట అక్కడ స్వచ్ఛందంగా సేవచేసి అక్కణ్ణుంచి ‘‘రసోదయ’’కు బయల్దేరతాడు.రసోదయ అక్కడకు కూతవేటు దూరంలో ఉంది.నడుస్తుంటే కాలి దగ్గర ఏదో అసౌకర్యంగా అనిపించింది.కాలి జోడు తెగింది.అలాగే కాలు ఈడ్చుకుంటూ కొన్ని అడుగులు ముందుకేశాడు.రసోదయకు కొంచెం దూరంలో చెప్పులుకుట్టే ఎంకడి దగ్గర ఆగాడు.ఎంకడు తలొంచుకుని చెప్పులుకుట్టే పనిలో నిమగ్నమై వచ్చినవ్యక్తిని గుర్తించలేకపోయాడు.

కాసేపటికి ఏదో అలికిడి విని పైకి చూశాడు.‘‘బాబూ గోరు...’’‘‘అయ్యో....తవరా...’’ అంటూ ఎంకడు వినయంగా పైకి లేచాడు.‘‘కూర్చో...కూర్చో... రింగు తెగిందోయ్‌...’’‘‘సిత్తం...’’ అంటూ ఎంకడు దాన్ని చేతిలోకి తీసుకున్నాడు.‘‘ఈ మధ్యనే అబ్బాయి తీసుకొచ్చాడు’’.‘‘ఇది తవకి సరిపోయిందా బాబుగోరూ... బిగుతుగా ఉన్నా ఒక్కోసారి తెగిపోవచ్చు...’’‘‘ఇద్దరిదీ ఒకటే సైజులే. సరే, మంటపం దగ్గరకెళ్తా...నువ్వు కుట్టేసి ఉంచు’’‘‘మీరెల్లండయ్యా, కుట్టేసి పట్టుకొస్తా’’‘‘మళ్ళీ నువ్వేం వస్తావులే.’’‘‘పర్లేదయ్యా, తవరెల్లండి’’పురుషోత్తం రసోదయ కార్యాలయంలో అడుగుపెట్టాడు.రసోదయ ఆ నగరంలో ఉన్న కల్యాణ మంటపాల్లో చాలా పెద్దది. అక్కడ ఏ శుభకార్యం చేసినా వాళ్ళకి మంచి జరుగుతుందని చాలామంది నమ్మకం.

పురుషోత్తం నాలుగేళ్ళుగా రసోదయ వ్యవహారాలన్నీ అన్నీ తానై చూసుకుంటున్నాడు.యాజమాన్యం అతనికి పూర్తి బాధ్యతలు అప్పగించింది.కుర్చీలో కూర్చున్నాక పురుషోత్తం చల్లనినీళ్ళు కాసిని గొంతుకలో పోసుకున్నాడు.పెళ్ళిళ్ళ సీజన్‌ కాకపోవటంవల్ల ఆఫీసు పని అంతగాలేదు.ఏదో ఆలోచిస్తూ అలా బయటకు చూస్తున్నాడు.అతనికి ఆ బయట కనిపించే సంగతులేవీ మనసుకు పట్టటం లేదు.అటూయిటూపోతున్న వాహనాలుగానీ, రద్దీగా ఉన్న దుకాణ సముదాయాలుగానీ అతని దృష్టికి చేరటం లేదు. అతని చూపంతా ఇప్పుడు ఎంకడి మీదే కేంద్రీకృతమై ఉంది.మనిషంటే ఎంకడు...వృత్తి ఏదైతేనే! నిజాయితీకి నిలువుటద్దం. ఎంకణ్ణి నాలుగేళ్ళుగా చూస్తున్నాడు. రసోదయకు ఎదురుగా రోడ్డుమీద అటూ ఇటూ ఎంకడి సహచరులే ఆ వృత్తిలో ఉన్నారు.